ప్రపంచంలో ఏం జరిగినా హ్యాకర్లు క్యాష్ చేసుకోవడంలో ముందుంటారు. మిగిలిన దేశాల్లో ఏమో కానీ, మన దేశంలో మాత్రం చాలా ముందుంటారు. తాజాగా మరోసారి అలాంటి హ్యాకింగ్/మాల్‌వేర్ ప్రయత్నం బయటపడింది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వం 18 ఏళ్లు పైబడినవారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. దీనినే హ్యాకర్లు ఆయుధంగా చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని తెలుపుతూ మెసేజ్‌లు పంపి ఆకట్టుకొని, రిజిస్ట్రేషన్ కోసం యాప్ డౌన్‌లోడ్ చేసుకోండని మాల్‌వేర్ లింక్ పంపుతున్నారు.
పైన ఇమేజ్ చూశారు కదా... ఇలాంటి మెసేజ్‌లే చాలామందికి వస్తున్నాయి. చూడటానికి మీ మీద అభిమానంతో ఎవరో పంపించినట్లు ఉంటాయి. వ్యాక్సినేషన్ కోసం సమాచారం ఇచ్చేలానే ఉంటాయి. అయితే ఆ లింక్‌ను క్లిక్ చేసి.. వాళ్లు చెప్పినట్లు నడుకుచుంటే మీ వ్యక్తిగత సమాచారం మొత్తం గోవిందా... గోవింద. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే... ఆ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే పేజీ, డౌన్‌లోడ్ అయ్యే యాప్ అచ్చంగా కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించినవిలానే ఉండటం. దీంతో ఎవరికీ అనుమానం రావడం లేదు.
అసలేమవుతోంది అంటే...
వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ అంటూ మెసేజ్‌లో వచ్చే లింక్‌ను క్లిక్ చేస్తే యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. అక్కడివరకు సమస్య చిన్నదే. అయితే ఆ యాప్ వాడటానికి ఓపెన్ చేసినప్పుడు మీ మొబైల్‌లోని కాంటాక్ట్స్, మెసేజ్‌లు, కాల్ హిస్టరీ... ఇలా యాక్సెస్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ వివరాలన్నీ ఆ మాల్‌వేర్ సృష్టించిన వ్యక్తికి వెళ్లిపోతాయి. అయితే ఇప్పుడు కొవిన్ యాప్ రిజిస్ట్రేషన్ మాటున వస్తున్న మాల్ వేర్ కొత్తగా ప్రవర్తిస్తుందట. మీ మొబైల్‌లో వివిధ సర్వీసుల బిల్లింగ్ ప్లాన్‌లు మార్చడం, లిమిట్ మార్చడం లాంటివి చేస్తుందట. అయితే ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే ఈ మాల్‌వేర్‌తో ఇబ్బందిపడుతున్నారట.