మెసెంజర్ యాప్ 'సిగ్నల్'కు కొత్త వినియోగదారులు పోటెత్తుతున్నారు. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్‌ను వినియోగించాలని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాత 'సిగ్నల్' డౌన్లోడ్లు భారీగా పెరుగుతున్నాయి.
మస్క్‌కు ట్విట్టర్లో 41.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన హింసాత్మక ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాకుండా వాట్సాప్ యాజమాన్య సంస్థ ఫేస్బుక్ నిలువరించలేకపోయిందని మస్క్ గురువారం రాత్రి ట్వీట్ చేశారు. ఫేస్‌బుక్‌ను విమర్శిస్తూ ఓ ఫొటోను షేర్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రస్థానం మొదలుపెట్టి దేశ రాజధానిలో ఘర్షణలు జరగడానికి కారణమయ్యే స్థాయికి ఫేస్బుక్ ఎదిగిందన్నారు. డోమినో ఎఫెక్ట్ అంటే ఇదే అని వ్యాఖ్యానించారు.
తన ఫాలోవర్లు అందరూ సిగ్నల్‌ను వినియోగించాలని వాట్సాప్‌ను ఎప్పుడూ విమర్శించే మస్క్ ట్వీట్ చేశారు. దీనికి తోడు... తాజాగా యూజర్ల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించేలా ప్రైవసీ పాలసీని వాట్సాప్ అప్డేట్ చేయడమూ ప్రతికూల ప్రభావం చూపింది.