వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో యూజర్లలో గందరగోళం నెలకొంది. వాట్సాప్ వాడాలా వద్ద అనే ఆలోచనలో పడ్డారు. ఇందుకోసం ఉన్న ఉత్తమ ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు.
ప్రస్తుతం వాట్సాప్‌కు ప్రధాన ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లవైపు మొగ్గు చూపుతున్నారు చాలా మంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా వాట్సాప్ బదులు సిగ్నల్ వాడమని సలహా ఇచ్చి వాట్సాప్‌ను మరింత ఇరకాటంలో పెట్టేశారు.
మరి వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లలో ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎందులో యూజర్ల డేటా సురక్షితంగా ఉంటుంది? వాట్సాప్ డేటా షేరింగ్ నిబంధనతో యూజర్ల నుంచి ఎలాంటి డేటా సేకరించనుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ ఫీచర్లు..
వాట్సాప్‌లో అనేక వెసులుబాట్లతో పాటు పలు పరిమితులూ ఉన్నాయి. ఇందులో యూజర్లు గ్రూప్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో 256 మందిని మాత్రమే చేర్చుకునేందుకు వీలుంటుంది. వ్యక్తిగత, గ్రూప్ వాయిస్, వీడియో కాల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే గ్రూప్ వీడియో కాల్ 8 మందికే పరిమితి. ఇందులో ఉన్న బ్రాడ్కాస్ట్ ఫీచర్‌తో ఒకే సందేశాన్ని ఎక్కువ మందికి వ్యక్తిగతంగా పంపేందుకు వీలుంటుంది.
వాట్సాప్‌లో ఇన్‌స్టా స్టోరీని పోలిన స్టేటస్ ఫీచర్ ఉంది. సిగ్నల్, టెలిగ్రామ్‌తో పోలిస్తే ఇది ప్రత్యేకమని చెప్పొచ్చు. ఈ యాప్ ద్వారా ఇతరులతో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవచ్చు. వీడియో, ఫొటో, ఆడియో ఫైళ్లకు 16 ఎంబీ పరిమితి. డాక్యుమెంట్లకు ఈ పరిమితి 100 ఎంబీ వరకు ఉంది.
వాట్సాప్ గూగుల్ డ్రైవ్, ఐ క్లౌడ్ ద్వారా ఉచితంగా థర్డ్ పార్టీ బ్యాకప్ సేవలను అందిస్తోంది.
టెలిగ్రామ్‌లో వాట్సాప్‌తో పోలిస్తే అనేక ఇతర కొత్త ఫీచర్లు ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏకంగా 2 లక్షలు మందిని యాడ్ చేయొచ్చు. పోల్స్, హ్యాష్‌ట్యాగ్స్, క్విజ్‌ల వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇవి గ్రూప్ కమ్యూనికేషన్లను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. టెలిగ్రామ్‌లో పంపించుకునే ఫైళ్ల సైజు 1.5 జీబీ వరకు ఉండొచ్చు. వాట్సాప్‌లో లేని సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్‌ను టెలిగ్రామ్ అందిస్తోంది. యూజర్లు వాయిస్, వీడియో కాల్స్ చేసుకునేందుకు వీలుంది.
సిగ్నల్.. మెసేజ్, వాయిస్, వీడియో కాల్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇవన్నీ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్టెడ్ కావడం గమనార్హం. ఇందులో బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్ లేదు. గ్రూప్‌లు క్రియేట్ చేసుకునేందుకు, గ్రూప్ కాల్స్ మాట్లాడేందుకు వీలుంది. ఏదైనా మర్చిపోకూడని విషయాన్ని గుర్తు చేసేందుకు 'నోట్ టూ సెల్ఫ్'అనే సరికొత్త ఫీచర్‌ను అందిస్తోంది సిగ్నల్. ఈ యాప్‌లోనూ సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్ ఉంది. వాట్సాప్‌తో పోలిస్తే.. ఇందులో ఎమోజీలు చాలా తక్కువ.