తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

గూగుల్​పై అమెరికా దావా- అసలు ఎందుకీ రగడ? - గూగుల్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ.. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టెక్​ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంటర్నెట్​లో గుత్తాధిపత్యానికి ప్రయత్నించిందని గూగుల్​ సంస్థపై అమెరికా న్యాయవిభాగం దావా వేసింది. పోటీదారులు, వినియోగదారులకు హాని కలిగించేలా గూగుల్‌ కార్యకలాపాలు ఉన్నాయని ఆరోపణలు చేసింది. అమెరికా ప్రభుత్వం ఒక టెక్ దిగ్గజ సంస్థపై చేసిన అతి పెద్ద ఆరోపణ ఇదే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏం జరిగింది ?

government's lawsuit
గూగుల్​పై అమెరికన్ ప్రభుత్వం వేసిన దావాలో ఏముంది ?

By

Published : Oct 21, 2020, 5:58 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

అమెరికా న్యాయ విభాగం గూగుల్​ను కోర్టుకు లాగాలని నిర్ణయించింది. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా అనుచితంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. గుత్తాధిపత్యం చెలాయిస్తూ.. అనైతికంగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ మేరకు ఇంటర్నెట్​ దిగ్గజంపై అమెరికన్​ ప్రభుత్వం దావా వేసింది. పోటీ సంస్థలకు హాని కలిగించేలా.. అనుచిత విధానాలతో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందనేది ప్రధాన ఆరోపణ.

20 ఏళ్ల కిందట మైక్రోసాఫ్ట్‌కు వ్యతిరేకంగా కేసు వేసిన తర్వాత... అమెరికా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.

అనైతిక విధానాలతో గూగుల్ వ్యవహరించిందన్న ఆరోపణ ప్రకంపనలు సృష్టిస్తోంది. గూగుల్ ఇంటర్నెట్​, సెర్చ్​ అడ్వర్టైజింగ్​లో దిగ్గజంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికన్ ప్రభుత్వ న్యాయ విభాగంతోపాటు 11 రాష్ట్రాల అటార్నీ జనరల్​లు గూగుల్​పై ఆరోపణలతో వ్యాజ్యం దాఖలు చేశారు. గూగుల్ అన్న పదం ఒక కంపెనీ పేరులాగా కాక.. సెర్చ్ ఇంజిన్ అనే మాటకు పర్యాయ పదంలా మారిందని ఈ 'లా-సూట్​'లో ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండువారాల సమయం కుడా లేని తరుణంలో ట్రంప్ ప్రభుత్వం చేసిన ఈ ఫిర్యాదుపై.. అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గూగుల్​పై అమెరికన్​ ప్రభుత్వం వేసిన దావాకు సంబంధించి 5 కీలక అంశాలు..

గూగుల్​ది గుత్తాధిపత్యమన్న ప్రభుత్వం..

  • కొన్నాళ్లుగా అమెరికా ప్రభుత్వానికి, టెక్​ సంస్థలకు మధ్య నడుస్తున్న వివాదాల అనంతరం.. ప్రభుత్వం గూగుల్‌ను చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్య సంస్థగా అధికారికంగా అభివర్ణించింది.
  • దాదాపు 90% ఇంటర్నెట్​ను గూగుల్​ శాసిస్తుంది. ఈ నేపథ్యంలో గుత్తాధిపత్యం చట్టవిరుద్ధమేం కాదు. అయితే, ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణ సంస్థను చిక్కుల్లో పడేసే అవకాశముంది.
  • సెర్చింజన్, ఆన్​లైన్ ప్రకటనల​ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకోవటానికి హానికరమైన విధానాలతో.. పోటీదారుల పట్ల అనైతికంగా వ్యవహరించిందన్న ఆరోపణ సంస్థను కలవరపెడుతోంది.
  • గుత్తాధిపత్యంతో గూగుల్​ పోటీదారులను అణిచివేసిందని.. దీని ద్వారా వినియోగదారులకు విభిన్న, ప్రత్యామ్నాయ సేవలు వినియోగించుకునే అవకాశం లేకుండా చేసిందని పేర్కొంది ప్రభుత్వం.
  • మొబైల్ ఫోన్లలో గూగుల్​ను డిఫాల్ట్ సెర్చ్​ ఇంజిన్​లాగా ఉంచేందుకు.. ఫోన్ల తయారీ సంస్థలకు గూగుల్ భారీగా చెల్లింపులు జరుపుతోందని, ఇందుకోసం ప్రకటనకర్తల నుంచి వచ్చే నిధులను వెదజల్లుతోందని పిటిషన్​లో న్యాయశాఖ ఆరోపణలు గుప్పించింది.

గూగుల్ వాదన ఇలా...

  • ఈ అంశాన్ని గూగుల్ మరో విధంగా చూస్తోంది. సంస్థ వినియోగదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని చెబుతోంది.
  • ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉందని, సృజనాత్మక విధానాలతో మార్కెట్​లో విస్తరించామని చెప్పుకొచ్చింది.
  • అదే సమయంలో చాలా సేవలు ఉచితంగా అందిస్తున్నామని గుర్తు చేసింది.
  • ఉచిత సేవలు అందిస్తూనే.. అడ్వర్టైజర్లకు వినియోగదారుల సమాచారం అందించకుండా జాగ్రత్త పడుతున్నామని వెల్లడించింది.

రాజకీయ ప్రమేయం ఉందా ?

  • న్యాయశాఖ వ్యాజ్యం వేసిన సమయం నుంచి.. ఇందులో ఉన్న ప్రతివాది వరకు.. ప్రతి అంశం ఈ చర్య వెనుక ఉన్న రాజకీయాల గురించి సమాధానం లేని ప్రశ్నలను లేవనెత్తుతోంది.
  • ఎన్నికల రోజుకు సరిగ్గా రెండు వారాల ముందు దావా వేయటం ఈ ప్రశ్నలకు మరింత బలం చేకురుస్తోంది. సాధారణంగా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నంగా కనిపిస్తాయనే భయంతో.. అధికారులు ఇటువంటి చర్యలకు దూరంగా ఉంటారు.
  • అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలు గూగుల్​పై సుమారు సంవత్సరం క్రితమే దర్యాప్తు ప్రారంభించాయి. దావాలో మాత్రం 11 రాష్ట్రాలే ఆరోపణలకు దిగాయి. అయితే, ఈ రాష్ట్రాలన్నింటికీ రిపబ్లికన్లే అటార్నీ జనరల్​గా ఉండటం గమనించాల్సిన విషయం.

20 ఏళ్లనాటి మైక్రోసాఫ్ట్​ కేసుతో పోలికలు ?

  • న్యాయనిపుణులు ఈ కేసును 22 సంవత్సరాల క్రితం నాటి.. మైక్రోసాఫ్ట్ కేసుతో పోల్చుతున్నారు. నాడు గుత్తాధిపత్యానికి సంబంధించే.. టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్​కు వివాదం చుట్టుకుంది.
  • నాడు గూగుల్​ స్టార్టప్​గా పరోక్ష బాధిత సంస్థగా ఉంది. అప్పుడు, గూగుల్​ సైతం మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడింది.
  • ప్రస్తుతం న్యాయశాఖ కేసు, గూగుల్ కంపెనీ ఉత్పత్తులు, సెర్చింజన్​లో దాని ఆధిపత్య స్థానం చుట్టూ తిరుగుతోంది. మైక్రోసాఫ్ట్​కు వ్యతిరేకంగా 1998 కేసు విండోస్, ఇతర ఉత్పత్తుల చుట్టూ తిరిగింది.
  • నాడు గూగుల్..​ మైక్రోసాఫ్ట్​ పోటీదారులకు నష్టం చేకూర్చేలా వ్యవహరించిందని ఆరోపించింది. కానీ, నేడు గూగులే "గుత్తాధిపత్యం చెలాయిస్తూ.. అనైతికంగా వ్యవహరిస్తోంది" అని ఈ దావాలో న్యాయశాఖ పేర్కొంది.
  • అయితే, ఈ ఆరోపణలపై ప్రతిస్పందనగా గూగుల్​.. ప్రస్తుత పరిస్థితులను, 90ల నాటి పరిస్థితులను పోల్చి చూడలేమని చెప్పుకొచ్చింది.

అసలు నష్టం అడ్వర్టైజర్లకే..

  • అమెరికన్​ డిజిటల్​ మార్కెట్​లో గూగుల్​ వాటా 29%. ఫేస్​బుక్​ 24% వాటాతో రెండో స్థానంలో ఉండగా.. అమెజాన్​ది 3వ స్థానం. కానీ, అడ్వర్జైజ్​మెంట్ల విషయానికి వస్తే గూగుల్ గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. మార్కెట్​లో వాటాలో దాదాపు 3వ వంతు ఈ సంస్థదే.
  • ఇలా ప్రత్యర్థి సంస్థలను ఎదగకుండా చేసి... గూగుల్ ప్రకటనల దందా చేస్తోందని ఆరోపిస్తున్నారు. దీనివల్ల, అడ్వర్టైజ్​మెంట్లు ఇచ్చేవారికి ప్రత్యామ్నాయాలు లేక, గూగుల్​ చెప్పిన ధర చెల్లించి నష్టపోతున్నారని వ్యాజ్యం​లో పేర్కొన్నారు.
  • అదనంగా, గూగుల్ వ్యాపారాలకు కావాలనుకుంటే తక్కువ నాణ్యత ప్రకటనలను కూడా అందించగలదని దావాలో న్యాయశాఖ పేర్కొంది. గూగుల్​.. వినియోగదారులను, అడ్వర్జైజర్లను తప్పుదోవ పట్టించే అవకాశముందని, ఇది చట్ట వ్యతిరేకమని ఆరోపించారు.

అయితే.. ఈ ఆరోపణల్లో నిజం లేదని, అనేక లోపాలున్నాయని గూగుల్ వ్యాఖ్యానించింది. కస్టమర్ ఫస్ట్ నినాదంతో ప్రత్యర్థి సంస్థల నుంచి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో వ్యాపారం నిర్వహిస్తున్నామని గూగుల్ అంటోంది. "గూగుల్ ఉత్పత్తులు వాడాలంటూ కస్టమర్లను ఎవరూ ఒత్తిడి చేయడం లేదు. వాళ్లే స్వచ్ఛందంగా మా ఉత్పత్తులను వాడుతున్నారు" అని గూగుల్ స్పష్టం చేసింది.

గతంలో ఐరోపా సమాఖ్య నుంచి కూడా గూగుల్ పై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈయూ 8.2 బిలియన్ యూరోల జరిమానా విధించింది. ఇప్పుడు అమెరికా వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details