వాట్సాప్ ప్రవేశపెట్టిన నూతన ప్రైవసీ నిబంధనల కారణంగా టెలిగ్రామ్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగాయని కంపెనీ ప్రకటించింది. దీంతో జనవరి మొదటి వారానికి 500 మిలియన్ల యాక్టివ్ యూజర్ల మార్కును దాటినట్టు తెలిపింది. 3 రోజుల్లోనే 25 మిలియన్ల కొత్త వినియోగదారులు వచ్చి చేరారని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా..
ఆసియా నుంచి 38శాతం, ఐరోపా నుంచి 27శాతం, లాటిన్ అమెరికా నుంచి 21శాతం ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల నుంచి 8శాతం మంది నూతనంగా వచ్చి చేరారని టెలిగ్రామ్ ప్రకటించింది. అయితే భారత్ నుంచి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారనే విషయాన్ని వెల్లడించలేదు.
''భారత్‌లో కేవలం జనవరి 6-10వ తేదీల మధ్య 15లక్షల యాప్ డౌన్లోడ్లు నమోదై ఉండవచ్చు.''
- సెన్సార్ టవర్ డేటా
''గతంలోనూ వేగవంతమైన డౌన్లోడ్లయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితి కాస్త భిన్నం. సేవలు పొందే విషయంలో తమ గోప్యతపై రాజీపడేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నది వాస్తవం. గత ఏడేళ్లుగా వినియోగదారుల వ్యక్తిగత గోప్యత, భద్రతకు పెద్దపీట వేస్తున్నాం.. కాబట్టే ఈ స్థాయిలో వృద్ధి నమోదవుతోంది.''
-టెలిగ్రామ్
అతిపెద్ద మార్కెట్.. భారత్..
2020అక్టోబర్ నాటికి 115కోట్ల మంది మొబైల్స్ కలిగిఉండగా.. 117కోట్ల డేటా వినియోగదారులతో ప్రపంచంలో భారత్ అతిపెద్ద టెలికామ్ మార్కెట్‌గా ఉంది. 2019నాటికే భారతీయులు సరాసరి డేటా వినియోగం 12జీబీగా ఉందని.. 2025నాటికి ఇది 25జీబీకి చేరుతుందని 'ఎరిక్సన్' అంచనా వేసింది.