అనంతమైన విశ్వంలో లెక్కకు మించిన గ్రహాలు. భూగోళం మాదిరిగానే ఇతర గ్రహాలపైనా జీవరాశి ఉందని.. అక్కడ జీవించేందుకు అవకాశం ఉందని పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇతర గ్రహాలపై జీవించేందుకు అనువైన వాతావరణం ఉందా లేదా.. అన్న ప్రయోగాలకు అంతేలేదు. అయితే విశ్వంలో మనకన్నా ఎన్నో రెట్లు తెలివైన జీవులు ఉన్నాయని వారు మనకు తెలియకుండానే సంకేతాలు పంపుతున్నారని వారే గ్రహాంతర వాసులని ఎప్పట్నుంచో చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో వారు మనుషుల కన్నా ఎన్నో రెట్లు తెలివైన వారన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లేనప్పటికి వారు తప్పక ఉన్నారనే భావిస్తున్నవారు చాలామంది ఉన్నారు.
విశ్వంలో గ్రహాంతరవాసుల ఉనికికి సంబందించి ఎన్నో కథలు, పుస్తకాలు, చలన చిత్రాలు వచ్చాయి. దీంతో గ్రహాంతర వాసుల ఉనికిపై మరింత ఆసక్తి పెరిగింది. అంతరిక్షంలో ఏవైనా తరంగాల వంటివి వెలువడినప్పుడు అవి గ్రహాంతరవాసులు పంపినవేనని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. మానవ మేథస్సుకు పరీక్ష పెట్టే ఘటనలు అంతరిక్షంలో చోటు చేసుకున్నప్పుడు ఆ ఘటనల వెనుక ఉన్నది గ్రహాంతరవాసులేనన్నది చాలామంది అభిప్రాయం.
ప్రముఖ బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సైతం గ్రహాంతర వాసుల ఉనికి గురించి చెబుతూ గ‌్రహాంతరవాసుల సందేశానికి స్పందించడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు కూడా. వాళ్లు మనుషుల కంటే ఎంతో అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడిన హాకింగ్.. వారితో మన పరిచయం ప్రమాదకరమేనని స్పష్టంచేశారు కూడా. మన సందేశాలను స్వీకరించే గ్రహాంతరవాసులు మనకంటే కొన్ని వందల కోట్ల ఏళ్ల ముందే ఉండొచ్చని ఆయన అన్నారు. మరోవైపు గ్రహాంతరవాసులు అన్వేషణ కోసం నైరుతి చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను కూడా ఏర్పాటు చేసింది. 30 ఫుట్‌బాల్ మైదానాలంత వైశాల్యంలో ఉన్న అపెర్చర్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్ ద్వారా గ్రహాంతర వాసుల కదలికలను పసిగట్టవచ్చన్నది చైనా ఆలోచన.
గ్రహాంతర వాసుల గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతున్నప్పటికీ అసలు వాటి ఉనికే తమకు కనిపించలేదని లేదని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. అయితే గ్రహాంతరవాసుల ఉనికి కోసం దశాబ్దాలుగా అంతరిక్షంలోకి కొన్ని సంకేతాలు, గుర్తులు పంపుతున్నా ఇప్పటికీ ఎలాంటి ప్రత్యుత్తరం లేదు. ఈ నేపథ్యంలో వీరు వెల్లడించిన వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వారు చెబుతున్న వివరాల ప్రకారం చూసుకుంటే ఈ విశ్వంలో మనిషి ఒంటరి జీవే. విశ్వంలో దాదాపు 10.3 మిలియన్లు అంటే కోటీ 30 లక్షల నక్షత్రాలు పరిశీలించిన పరిశోధకులు అందులో ఎక్కడా గ్రహాంతర వాసుల ఉనికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని అంటున్నారు.