ప్రమాదకరమైన సెప్సిస్ను ముందుగానే పసిగట్టే మరో అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేశారు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. వ్యక్తి శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్, రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించే పరిస్థితినే సెప్సిస్గా వ్యవహరిస్తారు. ఎవరికైనా ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వారి శరీరం తీవ్రంగా ప్రతిస్పందించడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య తీవ్రమైతే అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారమూ ఉంటుంది. ఇలాంటి ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం ద్వారా వ్యక్తి ప్రాణాలను రక్షించే వీలుంటుంది. దీనిలో భాగంగానే చెన్నై పరిశోధకులు నూతన సాంకేతికతను అభివృద్ధి చేశారు.
గ్యాసో ట్రాన్స్మిటర్ల పర్యవేక్షిస్తూ..
'మైక్రో ఫ్లూయిడ్ చిప్' ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని.. ధ్వని తరంగాలు, కెమికల్ ప్రోబ్స్, మైక్రోఫ్లూయిడ్ మిక్సర్తోపాటు రియాక్టర్ సాయంతో రూపొందించారు. వీటికి అనుసంధానంగా ఉండే లేజర్ సాయంతో రక్తం(ప్లాస్మా)లో ఉండే అణువుల స్థాయిలను అంచనా వేస్తుంది. ముఖ్యంగా గ్యాసో ట్రాన్స్మిటర్లుగా పిలిచే ప్లాస్మాలోని హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ల స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇలా బయోమేకర్లుగా పనిచేస్తూ సెప్సిస్ను ముందస్తుగా పసిగట్టి హెచ్చరిస్తుంది. కొందరు రోగుల్లో సర్జరీ సమయంలో ఒక్కోసారి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో గ్యాసో ట్రాన్స్మిటర్ల స్థాయిలను అంచనా వేయడం కూడా ఎంతో ముఖ్యం. ఈ నూతన పరిజ్ఞానం ద్వారా ఈ తరహా సమస్యను కూడా ముందే పసిగట్టవచ్చని ఈ పరికరాన్ని రూపొందించిన పరిశోధకులు స్పష్టంచేశారు.
భాగస్వామ్యం కోసం..