ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ మనకు అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతుంటాం. స్థానికులను అడుగుదామంటే భాష రాదు. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరి ఎంపిక గూగుల్ మ్యాప్స్. మనం వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి సులభంగా చేరుకునేలా దారి చూపిస్తుంది. అంతేకాకుండా మనం వెళ్లే దారిలో ట్రాఫిక్‌జామ్ ఉన్నా మరో దారిలో వెళ్లాలని సూచిస్తుంది. ఇందులో ఆఫ్‌లైన్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా దారి చూపిస్తుందన్నమాట. అయినా ఇది అంత కచ్చితత్వంతో దారి ఎలా చూపిస్తుంది? ట్రాఫిక్ సమాచారం ఎలా సేకరిస్తుంది? ఇలాంటి సందేహాలు మీకూ వచ్చాయా? దీనికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇటీవల గూగుల్ వెల్లడించింది.
ట్రాఫిక్ అంచనా ఎలాగంటే..
గూగుల్ ట్రాఫిక్ పరిస్థితులను అంచనా వేసేందుకు రెండు పద్ధతులను అనుసరిస్తుంది. ఇందులో మొదటిది ట్రాఫిక్ ప్యాట్రన్ పద్ధతి కాగా రెండోది సెన్సార్, స్మార్ట్‌ఫోన్స్ అందించే డేటా. వీటిలో ట్రాఫిక్ ప్యాట్రన్ ద్వారా పట్టణాలు, నగరాల్లోని రోడ్లపై ట్రాఫిక్‌ను అంచనా వేస్తే, సెన్సార్ డేటాతో జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ను అంచనా వేస్తారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు ఎక్కువగా జాతీయ రహదారులపైనే సెన్సార్‌లను ఏర్పాటు చేస్తాయి. వాటి డేటానే గూగుల్ ఉపయోగించుకుంటుంది.
ఇక ట్రాఫిక్ ప్యాట్రన్ కోసం వివిధ సమయాల్లో ఆయా ప్రాంతాల్లో వాహనాల వేగం, రాకపోకలను అంచనా వేసేందుకు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే యూజర్స్ జీపీఎస్ డేటాను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక మార్గంలో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో వాహనాలు 80 కి.మీ వేగంతో వెళుతుంటాయి. అదే మధ్యాహ్న సమయమంలో 30-40 కి.మీ వేగంతో వెళ్తుంటాయి. అందుకు గల కారణాలను గూగుల్ అంచనా వేసి మెషీన్ లెర్నింగ్ సాంకేతికతతో దానికి ఒక ట్రాఫిక్ ప్యాట్రన్‌ను కేటాయిస్తుంది. దీని ఆధారంగా ట్రాఫిక్ జామ్ డేటాను యూజర్స్‌కి అప్‌డేట్ చేస్తుంది.
మరింత మెరుగ్గా..
గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ అప్‌డేట్ ఇవ్వడంలో టైం అనేది ఎంతో ముఖ్యం. అలానే మ్యాప్ యూజర్స్ ఎంత సమయంలో తన గమ్యస్థానానికి చేరుకోవాలనుకుంటున్నారనేది కూడా ఎంతో అవసరం. దీనిని గ్రాఫ్ న్యూరల్ నెటవర్క్ అని అంటారు. దీనికి సంబంధించిన డేటాను కచ్చితత్వంతో సేకరించేందుకు గూగుల్ మ్యాప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే డీప్‌మైండ్ అనే సంస్థతో కలిసి పనిచేస్తోంది. ఇది గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్‌లో భాగమే. ఈ డేటా ఆధారంగానే గూగుల్ మ్యాప్స్ 13 ఏళ్లుగా ట్రాఫిక్‌ను అంచనా వేస్తూ ఆ డేటాను యూజర్స్‌కి అందజేస్తోంది. అయితే కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో రోడ్లపై తిరిగే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో గూగుల్ మ్యాప్స్ కూడా తన ట్రాఫిక్ ప్యాట్రన్స్‌లో పలు మార్పులు చేసింది.
రహదారులు ఎలా ఉన్నాయి..
అలానే ట్రాఫిక్ డేటాను సేకరించే ముందు గూగుల్ రహదారుల నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అంటే రోడ్లు చదునుగా ఉన్నాయా? ఎక్కడెక్కడ గుంతలున్నాయి? అది మట్టి రోడ్డా? తారు రోడ్డా? వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మనకు దారిని అందులో ప్రయాణిస్తే ఎంత టైంకి చేరుకుంటాం అనే సమాచారాన్ని సూచిస్తుంది.
ప్రత్యామ్నాయం ఎలా సూచిస్తుంది
ఒక వేళ మనం వెళుతున్న దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే గూగుల్ మరో దారిని సూచిస్తుంది. దానికి యూజర్స్ అందించే డేటాతో పాటు ప్రభుత్వం నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తుంది. వాటి ఆధారంగా ఆ దారిలో ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయి? ఎంత వేగంతో ప్రయాణించవచ్చు? ఒక వేళ ఏదైనా కారణం చేత ఆ దారి మూసివేశారా? వంటి విషయాలను విశ్లేషించి మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ట్రాఫిక్ తక్కువగా ఉండే మరో దారిని సూచిస్తుంది. అలానే మనకు సూచించే దారి ఎలాంటిది? రోడ్డు కండీషన్ ఎలా ఉంది వంటి విషయాలను కూడా తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో నిర్మాణాలు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా రోడ్లు మూసివేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆ దార్లో ప్రయాణించే వారి నుంచి వచ్చిన సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకుని వేరే దారిలో వెళ్లమని సూచిస్తుంది.
ఇదీ చూడండి:-'5జీ అభివృద్ధికి భారత్-ఇజ్రాయెల్-అమెరికా భాగస్వామ్యం'