ఏ వ్యాపార నిపుణుడిని కదిలించినా.. ఇప్పుడు అందరిది ఒకే మాట... గత దశాబ్దకాలం.. టెక్ దిగ్గజాలు, సామాజిక మాధ్యమాలదేనని. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ట్విట్టర్ సహా అనేక టెక్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార స్థితిగతులను పూర్తిగా మార్చాయని చెబుతారు. అంతే కాకుండా వాటితో మానవాళి జీవన విధానంలోనూ మార్పులు వచ్చాయనే సమాధానాలు వినిపిస్తుంటాయి.
అయితే ఇలాంటి సమూల మార్పులను తీసుకురాగలిగిన సంస్థలు.. ఏదో ఒక రోజు ఎదురుదెబ్బలను ఎదుర్కోక తప్పదనే మాటలూ వినపడుతున్నాయి. ప్రస్తుతం టెక్ సంస్థలకు జరుగుతున్నది కూడా అదే. డేటా ప్రైవసీ నుంచి యాంటి ట్రస్ట్ రాజకీయ పరిణామాల వరకు కొన్నేళ్లుగా టెక్ సంస్థలు అనేక అనిశ్చితులను ఎదుర్కొంటున్నాయి.
టెక్ సంస్థలను సమస్యల సుడిగుండలోకి నెట్టిన పరిణామాలను ఇప్పుడు చూద్దాం.
వ్యాపార గుత్తాధిపత్యం..
ప్రస్తుతం అమెరికా కేంద్రంగా పని చేస్తున్న టెక్ కంపెనీలు అనుభవిస్తున్న వ్యాపార గుత్తాధిపత్యం అక్కడి చట్టసభల్లో పరిశీలనకు వచ్చింది. ఈ విషయానికి సంబంధించి జ్యుడీషియరీ కమిటీ.. 449 పేజీల నివేదికను విడుదల చేసింది. అందులో ఈ టెక్ కంపెనీలు 'అత్యంత శక్తిసామర్థ్యాలను' కలిగి ఉన్నాయని పేర్కొంది.
'ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పటి చమురు బారాన్లు, రైల్రోడ్ టైకూన్లలాంటి గుత్తాధిపత్యాన్ని చూస్తున్నాం,' అని నివేదిక వివరించింది.
ఈ నివేదిక ప్రకారం ఫేస్బుక్.. సామాజిక మాధ్యమ మార్కెట్లో గుత్తాధిపత్యానికి నిదర్శనం. దీని డేటా అడ్వాన్టేజ్తో.. ఇతర వ్యాపారాలను స్వాధీనం చేసుకోవడం, కాపీ చేయడం, లేదా నాశనం చేయడం సహా కొత్త రకం బెదురింపులకు దిగొచ్చని పేర్కొంది.
పోటీ వ్యతిరేక వ్యూహాలతో ఆన్లైన్ సెర్చ్‌లో గూగుల్ గుత్తాధిపత్యం సాధించింది. ఇతర వెబ్సైట్లతో పోలిస్తే.. దాని సొంత కంటెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటివి కూడా ఇందుకు ఊపయోగగపడ్డాయి.
ఆన్లైన్ షాపింగ్‌లో అమెజాన్ 'ముఖ్యమైన, మన్నికైన రిటైల్ మార్కెట్ శక్తిలో' గుత్తాధిపత్యం కలిగి ఉందని నివేదిక ఆరోపించింది. ఇది థర్డ్ పార్టీ విక్రేతల విషయంలో పోటీ వ్యతిరేక ప్రవర్తనతో.. అమెజాన్ వినియోగదారుల కొనుగోలు విధానాన్ని అధ్యయనం చేసి.. హట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ వెర్షన్‌ను ఆవిష్కరించిందని పేర్కొంది.
యాపిల్.. యాప్ స్టోర్ ద్వారా గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. క్రియేషన్ విషయంలో అడ్డంకులు సృష్టించి.. ప్రత్యర్థి సంస్థలపై వివక్ష చూపడం, సొంత యాప్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేస్తుందని నివేదిక పేర్కొంది.