ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థల నుంచి... సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల వరకు అందరి నోటా వినిపిస్తున్న మాట... 5జీ. మనిషి జీవన విధానాన్నే సమూలంగా ఈ అత్యాధునిక నెట్వర్క్ మార్చేస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. ఆసక్తికరంగా మారింది ఆ సాంకేతికత ప్రయాణం. క్రమక్రమంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ఈ 5జీ విప్లవం గురించి తెలుసుకోవాల్సిందేమిటి ? ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి అనేక ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయి. మరి 5జీ ఆవశ్యకత ఎంతమేరకు ఉంది ?
5జీ... రానున్న కాలాన్ని శాసించనున్న అత్యాధునిక మొబైల్ నెట్వర్క్. భవిష్యత్ అంతా దీనిదే.
అసలు 5జీ కథేంటి ?
సింపుల్ భాషలో చెప్పాలంటే.. మొబైల్ నెట్వర్కింగ్ వ్యవస్థలో సరికొత్తది 5జీ. వైర్లెస్ సదుపాయంతో అత్యుత్తమ సేవలు అందించటం ప్రధాన లక్షణం. కనెక్టింగ్ సమస్యలు లేకుండా, సులువుగా ఇంటర్నెట్ ట్రాఫిక్ కంట్రోల్ చేసే సామర్థ్యం ఈ నెట్వర్క్ సొంతం.
ఎలా పని చేస్తుంది ?
వైర్లెస్. ఇదే 5జీ నెట్వర్క్ ప్రాథమిక సూత్రం. ఒకే నెట్వర్క్ ద్వారా వివిధ పనులు చేసుకునే వీలు కలుగుతుంది. మెరుపు వేగంతో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకే వ్యవస్థ అనేక నెట్‌వర్క్‌లు, డివైజ్లతో అనుసంధానమై ఉంటుంది.
ఈ నెట్వర్క్ వినియోగించేదెలా ?
అయితే, ఈ అధునాతన సేవలు ఆస్వాదించాలంటే నెట్వర్క్, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లు 5జీలోకి అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే సంస్థలు కొత్త మోడళ్ల ఫోన్లు విడుదల చేస్తున్నాయి. అయితే, నెట్వర్క్ టవర్లను సంస్కరించాల్సి ఉంటుంది. ఇది కాస్త సమయం తీసుకునే ఖరీదైన వ్యవహారం.
5జీ ద్వారా ఏం జరుగుతుంది ?
టెలీ మెడిసిన్ సహా ఆటోమేషన్, వ్యాపారాల్లో సాంకేతికత వంటి అంశాలను 5జీ కొత్తపుంతలు తొక్కించనుంది. చిటికెలో డౌన్లోడ్ అయిపోయే జీబీల డేటా అబ్బురపరచనుంది. కిక్కిరిపోయి ఉన్న ప్రదేశాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ లభించనుంది.
దేశాల మాటేంటి ?
ప్రస్తుతానికి 5జీకి వస్తున్న హైప్‌ను బట్టి చూస్తే.. త్వరలోనే దేశాలు ఈ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసేలా స్మార్ట్‌సిటీలు ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వర్చవల్ రియాల్టీ, కృత్రిమ మేధ, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ, ఐఓటీ, అధునాతన సెన్సార్లతో అత్యద్భుతాలు సృష్టించే అవకాశముంది. వీటన్నింటినీ 5జీ ద్వారా సులువుగా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే ఈ సాంకేతికత అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయి దేశాలు.
మరి భద్రత ముప్పు ?
అత్యధిక 5జీ ఉత్పత్తులు చైనా నుంచే వస్తుండటం ప్రపంచ దేశాలను కాస్త కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తిదారులను వివిధ దేశాలు ప్రోత్సహించట్లేదు. స్వదేశీ సాంకేతికతతో లేదంటే.. నమ్మకమైన మిత్ర దేశాల మద్దతుతో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాయి. అంతకుమించి భద్రత విషయంలో భయపడటానికి ఏం లేదంటున్నారు నిపుణులు.