తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఏమిటీ క్రిస్పర్‌-కాస్‌9... ఎందుకీ నోబెల్‌? - నోబెల్​ ప్రైజ్ గ్రహీత జెనిఫర్‌ డౌడ్నా

మనకు ఎరేజర్‌తో కూడిన పెన్సిల్‌ తెలుసు. ఇటీవల రసాయనశాస్త్రంలో నోబెల్‌ అందుకున్న ‘క్రిస్పర్‌-కాస్‌9’ టెక్నాలజీ కూడా ఇలాంటి ఎరేజర్‌-పెన్సిల్‌ లాంటిదే. ప్రకృతిసిద్ధంగానో, వారసత్వంగానో మన ‘జన్యుపటం’లో దొర్లిన తప్పుల్ని చెరిపేసి అక్కడ సరైనవాటిని రాస్తుందీ ‘క్రిస్పర్‌-కాస్‌9’. అలా చేయడం ద్వారా ఎన్నో మహమ్మారి వ్యాధుల్ని అరికట్టవచ్చని చెబుతున్నారు. మానవజాతి గతినే మార్చేయగలదని చెబుతున్న ఈ సాంకేతికత భవిష్యత్తులో చూపించే అద్భుతాలు ఇంకెన్నో ఉన్నాయి. అవేమిటో చూద్దామా.

Nobile prize winner Jennifer A Doudna
క్రిస్పర్‌-కాస్‌9

By

Published : Oct 18, 2020, 11:01 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

మీరో లేఖ రాస్తున్నారు. మొత్తం రాశాక ఓ చోట పదం ఒకటి తప్పుదొర్లింది. దాన్నేంచేస్తారు.. కాగితం పైనైతే ఎరేజర్‌ వాడతారు, కంప్యూటర్‌లోనైతే డిలీట్‌ చేస్తారు. ఆ తర్వాత రాయాల్సిన కరెక్ట్‌ పదమేంటో రాస్తారు. మన శరీరంలో కూడా ప్రకృతి రాసిన అలాంటి లేఖ ఒకటి ఉంటుంది. మూడువందల కోట్లపైచిలుకు పదాలున్న సుదీర్ఘ లేఖ అది! దాన్నే జన్యుపటం(జినోమ్‌) అంటాం. ఆ పదాలనే ‘డీఎన్‌ఏ’లు అని అంటాం. ఈ పదాల్లోని సూచనల మేరకే మన శరీరం ఎదుగుతుంది. వాటిల్లో ఏ పది, పన్నెండు పదాల్లోనో తప్పులొచ్చినా చాలు... మనం తీవ్రమైన వ్యాధులబారిన పడతాం! కొన్ని రకాల క్యాన్సర్‌లూ, పుట్టుకతోనే వచ్చే హృద్రోగాలూ, సికిల్‌ సెల్‌ అనీమియా, తలసీమియా వంటి వ్యాధులు ఇలాంటివే. ఈ తప్పులు దొర్లడం కొన్నిసార్లు పుట్టుకతోనే జరిగితే ఒక్కోసారి ఆ తర్వాత జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రకృతే ఆ తప్పుల్ని సరిచేయొచ్చు లేదా వదిలేయొచ్చు. ఇలా తప్పులు దొర్లడం, వాటిని సరిచేయడాన్నే.. ‘మ్యుటేషన్‌’ అంటారు.

మనిషి పుట్టిన తరవాత దాదాపు లక్ష సంవత్సరాలదాకా ఈ పనిని ప్రకృతి మాత్రమే చేస్తూ వచ్చింది. కానీ గత 35 ఏళ్ల నుంచి మనిషి అందులో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ప్రకృతి తనలేఖలో చేసిన పదాల(డీఎన్‌ఏ) తప్పుల్ని సరిదిద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దాన్నే ‘జీన్‌ ఎడిటింగ్‌’ అంటున్నారు. ఇందుకోసం ఎరేజర్‌లాంటి ఎడిటింగ్‌ వస్తువులెన్నో కనిపెట్టాడు. జింక్‌ ఫింగర్‌ న్యూక్లియస్‌, టాలన్స్‌ అలాంటివే! కాకపోతే, తప్పుల్ని కనిపెట్టి సవరించే క్రమంలో ఒక్కోసారి ఇవి పక్కనున్న అర్థవంతమైన పదాలకీ నష్టం కలిగించేస్తున్నాయని గుర్తించారు. అలా కాకుండా అనుకున్న లక్ష్యాన్ని(తప్పుల్ని) మాత్రమే పసిగట్టి సరిదిద్దడమే క్రిస్పర్‌-కాస్‌19 ప్రత్యేకత. 2015లో శాస్త్రవేత్తలు ఎమాన్యుయెల్లె చార్పెంటియర్‌, జెనిఫర్‌ ఎ డౌడ్నా దీన్ని ఆవిష్కరించారు. వారినే ఈ ఏడాది నోబెల్‌ వరించింది. జన్యు కత్తెర, ఎరేజర్‌... ఇలా రకాలుగా దీన్ని వర్ణిస్తున్నా ఇది కేవలం కొన్ని కృత్రిమ ఎంజైమ్‌ల కలయిక, అంతే! వీటిలోని ఓ కృత్రిమ ఆర్‌ఎన్‌ఏ ... తప్పులున్న డీఎన్‌లని గుర్తిస్తుంది. కాస్‌-9 అనే ఎంజైమ్‌ దాన్ని కట్‌ చేస్తుంది. ట్రేసర్‌-ఆర్‌ఎన్‌ఏ అనే మరొక ఎంజైమ్‌ సరిచేస్తుంది.

ఏమేం చేశారు!

ఈ సాంకేతికతని మొదట బీగిల్‌ జాతి కుక్కలపైన ప్రయోగించారు. కేవలం ఒక్క డీఎన్‌ఏ మార్పుతో ఓ బాడీ బిల్డర్‌లా దాని శరీరమంతా కండలు తిరిగేలా చేశారు. విదేశాల్లో పందుల్ని కూడా ముద్దుగా పెంచుకుంటారు కదా! వాటిని బుజ్జిగా... కేవలం ఓ పిల్లి సైజులో పుట్టించారు. మాంసానికీ, ఊలుకీ కొదవ లేకుండా... గొర్రెల్ని ఎక్కువ కండలతోనూ, రోమాలతోనూ పుట్టించగలిగారు. ఒకప్పుడు ప్రపంచంలో మమ్మత్‌ అనే భారీ ఏనుగులుండేవి... నేటి ఏనుగులకంటే రెండింతలుంటాయవి! ఇప్పుడున్న ఏనుగుల్లో జన్యుమార్పుల ద్వారా మళ్లీ వాటిని పుట్టిచ్చే పనిలోనూ ఉన్నారు. ఇక మొక్కల విషయానికొస్తే, వ్యాధులు అంటని వరి వంగడాలనీ ఎన్నిరోజులైనా కుళ్లిపోని టమోటాలనీ సంతృప్త కొవ్వుల్లేని సోయా బీన్స్‌నీ బంగాళాదుంపల్నీ సృష్టించేశారు.

భవిష్యత్తేమిటీ?

క్రిస్పర్‌-కాస్‌9 సాయంతో పందుల్లో మనుషులకున్నటువంటి అవయవాలని సృష్టించి... అవసరమైనప్పుడు వాటిని వాడుకునేలా చేయబోతున్నారు. మలేరియా, జికా వ్యాధులకి కారణమైన దోమల డీఎన్‌ఏని మార్చి వాటి తెగని నిర్వీర్యం చేసే ప్రయోగాలూ జోరందుకున్నాయి. సికిల్‌ సెల్‌ అనీమియా, తలసీమియా వ్యాధులూ, కొన్ని రకాల క్యాన్సర్లకైతే మందులు తయారై టెస్టింగ్‌ పూర్తిచేసుకుని మార్కెటింగ్‌ అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయి.

మరి కరోనా పైనా..

ఇప్పుడున్నవాటికంటే వేగంగా కేవలం కొన్ని నిమిషాల్లోనే కరోనా ఫలితాలని వెల్లడించేలా క్రిస్పర్‌-కాస్‌9తో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరీక్షలన్నీ కొవిడ్‌ వచ్చిన తర్వాత శరీరంలో కనిపించే ఎంజైమ్‌లూ, ప్రొటీన్‌ల ఆధారంగా ఫలితాలని చెబుతాయి. కానీ క్రిస్పర్‌-కాస్‌9 నేరుగా వైరస్‌నే గుర్తిస్తుంది కాబట్టి ఫలితాన్ని చాలా వేగంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు దీని ఆవిష్కర్త, తాజా నోబెల్‌ గ్రహీతల్లో ఒకరైన జెనిఫర్‌ డౌడ్నా!

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details