ఆన్లైన్లోని డిజిటల్ కంటెంట్‌కు చిన్నారులు, యువత బానిసలవ్వకుండా ఉండటానికి చైనా సరికొత్త నిర్ణయం తీసుకుంది. వ్యసనంగా మార్చేసే ఏ కంటెంట్‌పై అయినా ప్రభుత్వం లేదా తల్లిదండ్రులు చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. వాటిని తన రాజ్యాంగంలోనూ చట్టాలుగా పొందుపర్చనుంది.
నిషేధమే..
మొబైల్, అంతర్జాలం, డేటా వినియోగం పెరిగాక చిన్నారులు ఎక్కువగా పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్‌లు, కంటెంట్‌కు బానిసలు అవుతున్నారు. వాటిని నిషేధించినా, ఆడొద్దని హెచ్చరించినా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో చైనా తాజా నిర్ణయం తీసుకుంది. పిల్లలకు వ్యసనంగా మారే ఆన్లైన్ సేవలు, వస్తువులపై చైనా ప్రభుత్వం నిషేధం విధించనుంది. వీటితో పాటు చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకమైన హక్కులు రానున్నాయి. వాటి సాయంతో ఆన్లైన్ వేధింపులపైనా చర్యలు తీసుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా కంటెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తే.. సర్వీస్ ప్రొవైడర్లు వాటిని బ్లాక్ చేయడం, తక్షణమే తొలగించడం చేయాల్సి ఉంటుంది.