మొబైల్ గేమ్ డెవలపర్లకు మరోసారి షాకిచ్చింది టెక్ దిగ్గజం యాపిల్. చైనా ఐ స్టోర్ నుంచి ఒకేసారి 29,800 యాప్‌లు తొలగించింది. ఇందులో 26,000 వరకు గేమింగ్ యాప్‌లు ఉన్నట్లు ప్రముఖ పరిశోధన సంస్థ క్విమై వెల్లడించింది. అయితే ఈ విషయంపై అధికారికంగా స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది.
గేమ్ పబ్లిషర్లకు చైనా ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ నంబర్లను సమర్పించేందుకు జూన్ ఆఖరు తేదీని తుది గడువుగా నిర్ణయించింది యాపిల్. ఈ విషయంపై ఏడాది ప్రారంభంలోనే గేమ్ డెవలపర్లకు సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ లైసెన్స్ వివరాలు సమర్పించని గేమ్‌లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా కొత్త నిబంధనలు..
గేమింగ్ కంటెంట్ నిబంధనలు కఠితనరం చేసేందుకు చైనా ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త నిబంధనల పాటించని గేమ్‌లను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగిస్తున్నాయి టెక్ సంస్థలు.