భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహమ్మారి సంక్షోభాన్నీ సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కరోనా పేరిట నకిలీ ఖాతాలతో విరాళాలు సేకరిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు. భారత్లోని పలు సంస్థలను పోలిన నకిలీ ఈమెయిళ్లు ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. అసలైన సంస్థల నుంచి సంప్రదిస్తున్నట్లు మభ్యపెట్టి వ్యక్తుల నుంచి సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఐటీ సెక్యూరిటీ సంస్థ బర్రాకుడా నెట్వర్క్స్ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
- మొత్తం కేసుల్లో ఇలాంటివి(స్పియర్ ఫిషింగ్) కేసులు 72 శాతం నమోదయ్యాయి.
- సైబర్ దాడులలో 36 శాతం స్కామర్ల నుంచి ఉన్నాయి.
- 71 శాతం స్పియర్ ఫిషింగ్ మెయిళ్లలో ప్రమాదకర యూఆర్ఎల్లు ఉంటున్నాయి.
- బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్(బీఈసీ) దాడుల్లో 30 శాతం మెయిళ్లలో మాత్రమే లింక్లు ఉంటున్నాయి.
"స్పియర్ ఫిషింగ్ దాడుల్లో 13 శాతం అంతర్గత కాంప్రమైజ్డ్ ఖాతాల నుంచి వచ్చినవే. కాబట్టి బయట వ్యక్తుల నుంచి తమ ఖాతాలను రక్షించుకునేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తాయో.. అదే రకంగా అంతర్గత ఈమెయిల్ ట్రాఫిక్పైనా సంస్థలు దృష్టిసారించాలి."
-బర్రాకుడా నెట్వర్క్స్ నివేదిక