Russia Luna 25 Technical Glitch :చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాలన్న లక్ష్యంతో రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్లో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దాని భవితపై నీలినీడలు అలుముకున్నాయి. సమస్యను విశ్లేషించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ వ్యోమనౌక చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ల్యాండింగ్‌కు ముందు కక్ష్యకు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్కాస్మోస్ తెలిపింది. ఈ నేపథ్యంలో దాని ల్యాడింగ్ వాయిదా పడుతుందా అన్నదానిపై ఈ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యోమనౌక ఇప్పటికే చందమామకు సంబంధించిన ఫోటోలను అందించింది.
Russia Moon Mission Update :దాదాపు 50 సంవత్సరాల విరామం అనంతరం జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా సన్నద్ధమైంది. ఇందుకోసమే లూనా-25 ప్రయోగాన్ని చేపట్టింది. లూనా-25ను ఈ నెల 11న రష్యాలోకి వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. 11 రోజుల వ్యవధిలోనే చందమామపై దీన్ని దించేందుకు ప్రణాళికలు రచించుకుంది. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 కంటే ఒకటి, రెండు రోజులు ముందే లునా-25... చందమామ దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రయోగ ఫలితం ఆసక్తికరంగా మారింది.