ఒకప్పుడు స్మార్ట్ఫోన్ల ధరలు ఎక్కువ ఉండేవి. ఫీచర్లు మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఫీచర్లు బాగా పెరగటం సహా.. ధర తగ్గటం మొదలైంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో అనేక మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. రోజు రోజుకు సరికొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో కొనుగోలు చేసే సమయంలో కెమెరా, ఫోన్ సైజు లాంటి వాటితో పాటు ర్యామ్, ప్రాసెసర్, ఇంటర్నల్ మెమోరీ వంటి వాటి గురించి తెలుసుకోవటం సర్వ సాధారణమైంది. మరి ఇంతకీ ఫోన్లో ర్యామ్, ప్రాసెసర్ల పాత్ర ఏమిటి? వాటిని ఎందుకు అంత కీలకంగా పరిగణిస్తుంటారు?
ఫోన్లో ర్యామ్, ప్రాసెసర్, ఇంటర్నల్ మెమోరీ అనేవి చాలా కీలకమైనవి. ఇవి మొత్తంగా ఫోన్ పనితీరును ప్రభావితం చేస్తుంటాయి. మంచి ప్రాసెసర్, సరిపడా ర్యామ్, ఇంటర్నల్ మెమోరీ ఉన్నట్లయితే ఫోన్ పనితీరు మెరుగవుతుంది.
ర్యామ్
ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ. ఇది కూడా ఒక రకమైన మెమోరీనే. యాప్‌లు సరిగ్గా పనిచేయటం సహా మల్టీ టాస్కింగ్‌కు ఇది కీలకం. యాప్‌లు నడిచే సమయంలో తాత్కాలిక ఫైల్స్ అన్ని ఈ మెమోరీలోనే ఉంటాయి. ర్యామ్‌లో డేటాను యాప్‌లు వేగంగా ఉపయోగించుకుంటాయి.
మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ యాప్‌లు ఉపయోగించుకోవటం. ఒక్కో యాప్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు కొంత ర్యామ్‌ను వాడుకుంటుంది. ర్యామ్ తక్కువున్నట్లయితే ఎక్కువ యాప్‌లు ఉపయోగిస్తున్న సమయంలో అన్నింటి కంటే ముందున్న యాప్ క్లోజ్ అయిపోతుంది. దీని వల్ల మల్టీ టాస్కింగ్ కష్టం అవుతుంది.
కొన్ని యాప్‌లకు ఎక్కువ ర్యామ్ అవసరం ఉంటుంది. గేమ్స్ లాంటి వాటికైతే మరీ ఎక్కువ ర్యామ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్ల మంచి ప్రదర్శన కనబరుస్తాయి. మల్టీ టాస్కింగ్ కూడా చేస్కోవచ్చు.
ఓఎస్, సిస్టమ్‌లో ఉన్న ఇన్‌బిల్ట్ యాప్‌లు నడిచేందుకు కూడా ర్యామ్ కావాలి. అందుకే కొంత ర్యామ్ ఎప్పుడూ ఉపయోగంలోనే ఉంటుంది. ఫోన్ షట్‌డౌన్ చేయగానే ఇందులోని మెమోరీ డిలీట్ అయిపోతుంది. అంతేకాకుండా ర్యామ్‌లో కొంత మొత్తాన్ని ఓఎస్ ఉపయోగించుకుంటుంది.
ప్రాసెసర్
ప్రాసెసర్, ర్యామ్, మెమోరీని కలిపి మానవుని మెదడుతో పోల్చవచ్చు. అన్నింటికంటే ఫోన్లో ప్రాసెసర్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఫోన్ స్పీడ్‌కు సంబంధించినది. ఎంత వేగంగా ఒక యాప్ ఓపెన్ అవుతుంది, ఎంత త్వరగా ఒక ప్రక్రియ పూర్తవుతుందన్నది ప్రాసెసర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాసెసర్ వేగాన్ని గిగాహెర్ట్జ్లలో కొలుస్తారు. ఇది ఎక్కువగా ఉన్న ఫోన్లలో మంచి ప్రదర్శన ఉంటుంది.