కొన్ని ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి.. 'బ్లూటూత్ డివైజ్' ద్వారా ఇప్పుడు ఎవరి సాయం తీసుకోకుండా నడుస్తున్నాడు. ఆ పరికరాన్ని స్విట్జర్లాండ్‌లోని లౌసన్నే నగరానికి చెందిన వైద్యులు తయారు చేశారు. శరీరంలోని మెదడు, వెన్నెముకను అనుసంధానిస్తూ తయారు చేసిన ఈ బ్లూటూత్ డివైజ్ సహాయంతో సిగ్నల్స్ అందుకుని ముందుకు నడవగలుగుతున్నాడు.
ముందుగా ఈ బ్లూటూత్ డివైజ్‌ను ప్రమాదం వల్ల దెబ్బతిన్న వెన్నెముకతో పాటు శరీరంలోని మెదడుకు వైద్యులు అనుసంధానం చేశారు. ప్రయోగాత్మకంగా తయారు చేసిన ఈ డివైజ్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి నిలబడటానికి, నడవడానికి మాత్రమే కాకుండా మెట్లు ఎక్కడానికి కూడా సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
40 ఏళ్ల గెర్ట్ జాన్ ఓస్కం 12 ఏళ్ల క్రితం ఓస్కం.. ఓ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడం వల్ల పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. న్యూరోసర్జన్లు ఓస్కం మెదడుతో పాటు వెన్నెముకలో ఎలక్ట్రోడ్‌లను అమర్చారు. వీటిని బ్లూటూత్‌తో అనుసంధానించారు. ఇది మెదడు నుంచి వచ్చే సంకేతాలను పక్షవాతానికి గురైన వ్యక్తి శరీర భాగంతో పాటు కాళ్ల కదలికలను నియంత్రిస్తుంది.
"5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో నేను నా హిప్స్‌ను నియంత్రించుకోగలిగాను. మెదడులో ఉండే బ్రెయిన్ ఇంప్లాంట్ల ద్వారా నా హిప్స్ ఏ విధంగా స్పందిస్తున్నాయో నేను గమనించగలిగాను. మొత్తంగా ఈ డివైజ్ ఉత్తమ ఫలితాన్నిచ్చింది. కాబట్టి నాలాగా బాధపడే ప్రతిఒక్కరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అయితే నేను కేవలం నిలబడటానికే పది సంవత్సరాలు సాధన చేయాల్సి వచ్చింది. కానీ, డాక్టర్లు తయారు చేసిన ఈ బ్లూటూత్ డివైజ్‌తో కేవలం నిలబడటమే కాకుండా నడవగలుగుతున్నాను. మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను"