కొవిడ్-19 బాధితుల్లో మరణం ముప్పును ముందే అంచనా వేయడానికి రెండు సంకేతాలు బాగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి, శ్వాస రేటును తెలుసుకోవటం ద్వారా వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతోందన్నదానిపై అవగాహనకు రావొచ్చని చెప్పారు. ఈ రెండు అంశాలను ఇంటివద్దే పరీక్షించుకునే వీలుందని వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
అప్పుడే వైద్యసాయం..
కొవిడ్‌తో ఆసుపత్రులపాలైన 11 వందల మందిపై ఈ అధ్యయనం సాగించారు. కరోనా బారినపడిన వారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిపడటం, ఛాతీపై ఒత్తిడి లేదా నొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడే వైద్య సాయం కోరాలని అమెరికాలోని 'సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' మార్గదర్శకాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే శ్వాస రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకర స్థాయికి పడిపోయినప్పుడూ కొందరిలో ఈ సంకేతాలు ఉండవని చెప్పారు. ఇలాంటివారు తమకు వైద్యసాయం అవసరమని గుర్తించి, ఆస్పత్రిలో చేరే సమయానికి.. వారిని కాపాడటానికి ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయని పరిశోధనలో పాల్గొన్న నీల్ ఛటర్జీ తెలిపారు.