Online Addiction: టెక్ యుగంలో దాదాపు 50 శాతం మంది ప్రజలు.. రోజులో 5-6 గంటలు స్మార్ట్‌ఫోన్ల వినియోగానికే గడుపుతున్నారట. అవసరం ఉన్నా.. లేకున్నా.. తెలియకుండానే ఫోన్లలో గంటల తరబడి సమయం వృథా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన ఏడాదిలోనైనా ఫోన్‌లను అవసరమైనంత మేరకు వాడి.. 'స్మార్ట్'గా జీవించాలని చాలా మంది భావిస్తున్నారు. ఇందుకు మొబైల్స్‌లోని పలు యాప్‌లకు పూర్తిగా స్వస్తి పలకడం, లేదా వాటి వినియోగాన్ని తగ్గించడం చేస్తున్నారు. మరి 2022లో ప్రపంచం వదిలేయాలని చూస్తున్న వాటిల్లో ఏమున్నాయో మీరు ఓ లుక్కెయండి..
ముందు వరుసలో సామాజిక మాధ్యమాలు
social media addiction: కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నామో తెలియకుండానే సోషల్ మీడియాలో గంటల తరబడి సమయం గడిపేస్తాం. ముఖ్యమైన విషయాలను సైతం పక్కనపెట్టి అందులో మూతి పెట్టేస్తాం. ఇది మన వ్యక్తిగత, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇందువల్లే ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. లేదంటే తాత్కాలిక విరామం తీసుకోవాలని యోచిస్తున్నారు. సోషల్ మీడియా ఫుష్ నోటిఫికేషన్లను ఆఫ్ చేసి, వాటిపై దృష్టి మళ్లకుండా ఉండాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్రత్యేకంగా ఓ సమయం కేటాయించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా మన వ్యక్తిగత జీవితాన్ని సాఫీగా గడపవచ్చని సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్‌కు..
సామాజిక మాధమ్యాల తర్వాత మన సమయాన్ని డిస్ట్రాక్ట్ చేసే వాటిల్లో ఆన్‌లైన్ గేమ్స్ కూడా ఒకటి. కరోనా కారణంగా ఇది ఈ మధ్య ఎక్కువైంది. కొన్నిసార్లు పని ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆన్‌లైన్ గేమ్స్ ఉపయోగపడుతాయి. అయితే, వీటికి ప్రత్యామ్నాయంగా 2022లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. మరోవైపు ఫోన్ ఓవర్ హీట్, స్టోరేజ్ సమస్య వంటి కారణాలతో పలువురు ఆన్‌లైన్ గేమ్స్‌కు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. ఆరోగ్యం దృష్ట్యా శారీరక దృఢత్వం పెంచుకోవాలని మైదానంలో అడుగేయాలని చూస్తున్నారు.