e plane air taxi: ఇప్పటివరకు ఆటోలో, ట్యాక్సీల్లో ప్రయాణం చేసి ఉంటారు. కానీ ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం చేశారా? త్వరలోనే ఇది నిజం కాబోతుంది. దేశంలోని కొన్ని కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నాయి. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన డ్రోన్ ఫెస్టివల్లో ఈ ప్లేన్ సంస్థ ఎయిర్ ట్యాక్సీ మోడల్‌ను ప్రదర్శించింది. ఈ ఎగ్జిబిషన్‌కు వచ్చిన అనేక మంది అధికారులు, వివిధ సంస్థలు ప్రతినిధులు, ప్రజలు ట్యాక్సీని ఆసక్తిగా తిలకించారు.
ఈ-ప్లేన్ అనే సంస్థ ఈ-20 పేరుతో ఎయిర్ ట్యాక్సీ నమూనాను రూపొందించింది. ఇది హెలికాప్టర్లాగా గాలిలో ఎగురుతుంది. నేలపై ల్యాండ్ అవుతుంది. దీంట్లో రెండు సీట్లు ఉండగా.. ఒకటి పైలట్‌కు, మరొకటి ప్రయాణికుడు కూర్చోవడానికి వీలుగా తయారు చేశారు రూపకర్తలు. దీనికి 12 ప్లాస్టిక్ పేపర్ రోటర్లను అమర్చారు. ఇది 200 కిలోమీటర్ల వరకు గంటకు గరిష్ఠంగా 160 కిమీ వేగంతో ప్రయాణిస్తుందని.. 3000 మీటర్ల ఎత్తు వరకు వెళుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఎయిర్ ట్యాక్సీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని రూపకర్తలు తెలిపారు. ఎయిర్ ట్యాక్సీ ఇంటి పైకప్పు నుంచి రాకపోకలను సాగించేలా తయారు చేశామని చెప్పారు.