ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా తన బ్రాండ్ విలువను నిలబెట్టుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా.. 60 ఏళ్ల తర్వాత కంపెనీ కొత్త లోగోను డిజైన్ చేసింది. కంపెనీ కొత్త లోగోలో నోకియా అనే పదంలోని ఐదు అక్షరాలని వేర్వేరు రూపాల్లో రూపొందించారు. ఈ లోగో కంపెనీకి సరికొత్త వ్యాపార ప్రణాళికలను అందించడానికి సహాయపడుతుందని కంపెనీ సీఈవో పెక్కా లుండ్‌మార్క్ వెల్లడించారు.
ETV Bharat / science-and-technology
60 ఏళ్ల తర్వాత లోగో మార్చిన నోకియా.. ఎందుకో తెలుసా..? - మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023
కీప్యాడ్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కొత్తలో నోకియాకు ఉన్న ప్రజాదరణ అంతా ఇంతా కాదు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే స్మార్ట్‌ఫోన్ వచ్చాక ఈ నోకియా బ్రాండ్ మార్కెట్లో అంతగా రాణించలేకపోయింది. దీంతో మొబైల్ వ్యాపారాన్ని హెఎండీ గ్లోబల్ సంస్థకు విక్రయించింది. అనంతరం బాధ్యతలు చేపట్టిన హెఎండీ సంస్థ.. తిరిగి నోకియా బ్రాండ్‌ను మార్కెట్లో నిలబెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే దాదాపు 60 సంవత్సరాల తర్వాత కంపెనీ లోగోను మార్చుతున్నట్లు ప్రకటించింది.
సోమవారం బార్సిలోనాలో ప్రారంభమైన వార్షిక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో.. కంపెనీ వ్యాపార విస్తరణకు సంబంధించి సరికొత్త ప్రణాళికను వెల్లడించనున్నట్లు లుండ్‌మార్క్ తెలిపారు. 2020లో కష్టాల్లో ఉన్న నోకియా కంపెనీ అధికారిక పగ్గాలు చేపట్టాక మూడు కీలక మార్పులకు వ్యూహాలు రచించినట్లు లుండ్‌మార్క్ చెప్పారు. రీసెట్, వేగవంతం చేయడం, అభివృద్ధి బాట పట్టించడం.. ఇందులో మొదటి దశ పూర్తి కావడం వల్ల ప్రస్తుతం రెండో దశ ప్రారంభమవుతోందని ఆయన అన్నారు. నోకియా ప్రస్తుతానికి తన సర్వీస్ ప్రొవైడర్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం అమ్మకాల్లో 21 శాతం వృద్ధిని సాధించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వృద్ధిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
నోకియా మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థకు విక్రయించిన తర్వాత టెలికాం రంగం, సాంకేతికతపై మరింత దృష్టి సారించింది. ప్రస్తుతం హెచ్‌ఎండీ టెలికాం సంస్థలకు కావాల్సిన సాంకేతికతను అందించడమే కాకుండా.. ఆటోమేషన్ పరిశ్రమలకు అవసరమైన 5జీ నెట్‌వర్క్ సాంకేతికతను కూడా అమ్మకాలు జరుపుతోంది. దీనిలో భాగంగా గతేడాది జియో సంస్థతో నోకియా కీలక ఒప్పదం చేసుకుంది. ఇందులో భాగంగా జియో సంస్థకు బేస్ స్టేషన్లు, మిమో యాంటెన్నాలు, వివిధ స్పెక్ట్రమ్‌లను సపోర్ట్ చేసే రిమోట్ రేడియో హెడ్లు, సెల్ఫ్ ఆర్గనైజింగ్ నెట్‌వర్క్ సాఫ్ట్‌వేర్‌లను నోకియా సరఫరా చేయనుంది. ప్రస్తుతం ఆటోమేషన్, డేటాసెంటర్లు ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు లుండ్‌మార్క్ తెలిపారు. ప్రధాన టెక్నాలజీ ఆధారిత సంస్థలు సైతం నోకియా అందించే 5జీ ప్రైవేట్ నెట్‌వర్క్ కోసం తమ సంస్థతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పుడు కంపెనీ దృష్టంతా ఇతర వ్యాపారాలను విస్తరించడంపై ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో భారత్‌లో తమ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు.