ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా వినియోగదారుడే తన మొబైల్ రిపేర్ చేసుకునే విధంగా ఓ బడ్జెట్ ఫోన్‌ను తీసుకువచ్చింది నోకియా. జీ22 సిరీస్‌తో తీసుకువచ్చిన ఈ ఫోన్‌ను ఇంటివద్ద మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ఛార్జింగ్ పోర్ట్, బ్యాటరీ, డిస్ప్లే, బ్యాక్ కవర్ వంటి భాగాలను సులభంగా విప్పి మార్చుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ఫోన్లో మూడు రోజుల పాటు పనిచేసే బ్యాటరీ ఉన్నట్లు తెలిపింది. అనేక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువే. ఈ జీ22 ఫోన్‌తో పాటుగా.. సీ32, సీ22 అనే మరో రెండు బడ్జెట్ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయా చూద్దామా మరి..!
సొంతంగా రిపేర్ చేసుకునే తొలి స్మార్ట్‌ఫోన్
వినియోగదారుడే రిపేర్ చేసుకునే తొలి స్మార్ట్‌ఫోన్ జీ22 అని నోకియా వెల్లడించింది. దీనిలో 100 శాతం రిసైకిల్ ప్లాస్టిక్ బ్యాక్ కవర్ ఉంటుందని తెలిపింది. దీని బ్యాటరీ లైఫ్ మూడురోజుల వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ ఫోన్లో.. డిస్ప్లే పగిలినా, ఛార్జింగ్ పోర్ట్ బెండ్ అయినా, బ్యాటరీ, బ్యాక్ కవర్లు వంటివి పాడైనా సరే వాటిని సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఐఫిక్సిట్ భాగస్వామ్యంతో ఓ టూల్ కిట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఉండే ప్రత్యేకమైన గైడ్ సహాయంతో ఫోన్‌ను రిపేర్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఐఫిక్సిట్ రిపేర్ గైడ్ ఐదేళ్ల పాటు అందుబాటులో ఉంచుతున్నట్లు నోకియా సంస్థ వెల్లడించింది. iFixit.com ద్వారా దాదాపు రూ.430 ఖర్చు చేసి ఈ రిపేర్ కిట్‌ను కొనుగోలు చేసుకోవచ్చని హెచ్ఎమ్డీ గ్లోబల్ సంస్థ తెలిపింది. శనివారం బార్సినాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో వీటిని లాంచ్ చేసింది.
జీ22 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర
- 6.53 అంగుళాల స్క్రీన్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 50+2+2 ఎంపీల ట్రిపుల్ బ్యాక్ కెమెరా
- 8 ఎంపీ ప్రంట్ కెమెరా
- 4/64, 4/128 జీబీల మెమరీ స్టోరేజ్
- 5,050mAh సామర్థ్యం గల రిపేరబుల్ బ్యాటరీ
- 3 రోజుల బ్యాటరీ లైఫ్
- 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
యూకే మార్కెట్లో మార్చి 8 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ఫోన్ ధర భారత్‌లో సుమారు రూ. 15,000 ఉంటుంది. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల వారంటి కూడా అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ లగూన్ బ్లూ, మెటోర్ గ్రే కలర్ల్లో మార్కెట్లోకి తెస్తున్నట్లు తెలిపింది.