ఇంటర్నెట్ ఇప్పుడు ఇంటింటి అవసరంగా మారింది. సమాచారం తెలుసుకోవటానికో, వస్తువులు కొనటానికో, నగదు లావాదేవాలకో, సేవలు పొందటానికో.. ఇలా అనుక్షణం ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. అంతర్జాలంలో నిక్షిప్తమైన వెబ్‌సైట్ల భాండాగారంలో ఇవన్నీ గోరంతే. లోతుకు వెళ్లినకొద్దీ వజ్ర వైఢూర్యాల్లాంటివి చాలానే దొరుకుతాయి. మచ్చుకు కొన్ని వెబ్‌సైట్లను ప్రయత్నించి చూడండి.
బెరుకులేని రాత
ఇంగ్లిష్‌లో రాయాలని ఉబలాటం. తప్పులు దొర్లుతాయేమోనని భయం. వీటి నుంచి తప్పించుకోవటానికి తోడ్పడే వెబ్‌సైట్ https:// hemingwayapp. com/..ఇంగ్లిష్‌లో ధైర్యంగా, స్పష్టంగా రాయటానికి తోడ్పడే సాధనమిది. గ్రామర్లీ మాదిరిగానే ఉంటుంది గానీ పూర్తిగా ఉచితం. శైలి మీద దృష్టి సారిస్తుంది. పొడవైన, సంక్లిష్టమై వాక్యాలను.. సాధారణ తప్పులను ఎత్తి చూపుతుంది.
వాక్యం పసుపు రంగులో కనిపిస్తే విడదీయాలని.. అదే ఎరుపు రంగులో కనిపిస్తే భాష చాలా గాఢంగా, సంక్లిష్టంగా ఉందని అర్థం. ఊదారంగులో ఏదైనా పదం కనిపిస్తే పొట్టి పదం వాడాలనటానికి సంకేతం. క్రియా విశేషణాలు, అసందర్భ పదబంధాలను నీలిరంగులో ఎత్తి చూపుతుంది. మొత్తమ్మీద రాత నైపుణ్యాలను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.
వెబ్‌లో అగ్ర విషయం
అంతర్జాలంలో ప్రతి క్షణం కొత్త కొత్త అంశాలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఒకో రంగంలో ఒకోటి ముందుకు దూసుకొస్తుంటుంది. వీటి గురించి తెలుసుకుంటే అగ్రస్థానంలో నిలవొచ్చు. ఇతంటి విశాల వెబ్ ప్రపంచంలో అన్నింటికన్నా అగ్రస్థానంలో కొనసాగుతున్న అంశాలను తెలుసుకోవటమంటే మాటలా? https://contentideas.io/ వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఇదేమంత కష్టమైన పని కాదు.
వార్తలు, కళలు, వినోదం, టెక్నాలజీ, రాజకీయం, అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్, ప్రయాణం, ఆర్థికం, సైన్స్.. ఇలా ఆయా విభాగాల వారీగా ట్రెండ్ అవుతున్న అంశాలను ఇట్టే తెలుసుకోవచ్చు. బ్లాగ్ పోస్ట్‌లకు అవసరమైన ఐడియాలను పొందొచ్చు. ఆయా రంగాల్లో వస్తున్న అధునాతన మార్పులను దీంతో ఓ కంట కనిపెడుతుండొచ్చు.
చదువుల గని
జిజ్ఞాస ఉండాలే గానీ అంతర్జాలంలో సొంతంగానే బోలెడంత చదువుకోవచ్చు. అదీ ఉచితంగా. ఇందుకు ప్రత్యేకించిన వెబ్‌సైట్లు బోలెడున్నాయి. కాకపోతే ఎందులో ఏ విషయముందో అనేది తెలుసుకోవటమనేది తేలికైన విషయం కాదు. వీటన్నింటినీ ఒకచోటే తెలుసుకునే వీలుంటే?https://freelearninglist.org అలాంటి వెబ్‌సైటే.
యూట్యూబ్, పాడ్‌కాస్ట్‌లు, కోర్సులు, ఎఫెక్టివ్ థింకింగ్, సబ్‌రెడిట్స్, జనరల్, లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్, బుక్స్, హౌ టూ.. ఇలా విడివిడిగా అన్నింటినీ ఒకేచోట చూసుకోవచ్చు.
శాస్త్ర సందేహ నివృత్తి
మనసులో ఎన్నెన్నో సందేహాలు. వీటిని నివృత్తి చేసుకో వటానికి అంతర్జాలంతో వెతకటం సులభమే. అయితే అవి నిజమేనా? శాస్త్రబద్ధమైనవేనా? అని తరచూ అనుమానం వస్తుంటుంది. మరి ఆయా అంశాలకు సంబంధించి పరిశోధనలు ఏం చెబుతున్నాయని తెలుసుకోవటమెలా? https:// consensus.app/ వెబ్‌సైట్‌లో వెతికితే సరి.
ఇది కృత్రిమ మేధతో కూడిన సెర్చ్ ఇంజిన్. తెలుసుకోవాల్సిన విషయాన్ని ప్రశ్న రూపంలో టైప్ చేస్తే చాలు. శాస్త్ర పరిశోధనల నుంచి వాటిని వెతికి మన ముందుంచుతుంది.