చూపులేనివారు ఇక ఎన్నటికీ చదువుకోలేరని అనుకునే రోజులవి. కళ్లతో పదాలను చూస్తే గానీ చదవటం, రాయటం సాధ్యం కాదని అనుకునే రోజులవి. లూయీ బ్రెయిలీ ఈ భావనలను తుడిచిపెట్టేశారు. చూపు లేకపోతే రోజువారీ జీవితం ఎలా ఉంటుందో ఆయనకు స్వయంగా తెలుసు. ఎదురయ్యే ఆటంకాలు, ఇబ్బందులు తెలుసు. వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలుసు. చిన్నప్పటి నుంచే చదువుల మీదున్న ఆకాంక్షే ఆయనకు "కొత్త చూపు" ప్రసాదించింది. స్పర్శతోనే అక్షరాలను గుర్తించే విద్య నేర్పించింది. ఆ నేర్చుకున్న దాంతోనే ఇతరులకు విద్యను ప్రసాదించటానికీ దారి చూపించింది. చూపు లేకపోయినా తేలికగా చదువుకోవటానికి వినూత్న మార్గం వేసింది. ప్రపంచానికో కొత్త లిపిని ప్రసాదించింది. బ్రెయిలీ లిపి కోసమే పుట్టారనే విధంగా ఆయన జీవితం సాగింది.
ప్రమాదవశాత్తు అంధత్వం..
లూయీ బ్రెయిలీ కథ పందొమ్మిదో శతాబ్దం తొలినాళ్లలో మొదలైంది. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరానికి సమీప గ్రామంలో జనవరి 4, 1809లో ఆయన జన్మించారు. తండ్రి తోలు వస్తువులను తయారు చేసేవారు. తోలును కత్తిరించటానికి, రంధ్రాలు పెట్టటానికి పెద్ద దబ్బనంలాంటి పదునైన పనిముట్లు ఉపయోగించేవారు. బాల బ్రెయిలీ ఒకసారి ఇలాంటి పదునైన దబ్బనంతో ఆడుకుంటూ ఉండగా.. పొరపాటున అది ఒక కంట్లో దిగబడింది. మొదట్లో అంత ప్రమాదకరంగా అనిపించలేదు. కానీ రాన్రానూ పెద్దగా అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కన్ను పోయింది. అది చాలదన్నట్టు కొద్దిరోజుల తర్వాత రెండో కంటికీ ఇన్‌ఫెక్షన్ సోకింది. అదీ పోయింది. దీంతో లూయీ ప్రపంచం పూర్తిగా చీకటిమయమైంది. అప్పటికి అతడి వయసు మూడేళ్లు.
మొదట్లో అతడికేమీ అర్థమయ్యేది కాదు. తనకెందుకు కనిపించటం లేదని అమాయకంగా అడిగేవాడు. చూపు లేకపోయినా బ్రెయిలీ తెలివి అమోఘం. తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు. తండ్రి చేసి ఇచ్చిన కర్ర సాయంతో గ్రామంలో వీధులన్నీ చుట్టబెట్టేవాడు. తన స్నేహితులతో కలిసి బడికి వెళ్లేవాడు. అందరికన్నా బాగా చదివేవాడు. అనతికాలంలోనే తెలివైనవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అంధత్వం అతడి సృజనాత్మకతకు ఎన్నడూ అడ్డు తగల్లేదు.
అయితే ఆ చిన్న బడిలో అంతగా సౌకర్యాలు లేకపోవటంతో వేరే స్కూలుకు వెళ్లాలని అనుకున్నాడు. అప్పుడే అంధుల కోసం ప్రత్యేకించిన రాయల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ యూత్ గురించి తెలిసింది. అందులో చేరిన వెంటనే తండ్రిని అడిగిన ప్రశ్న చూపులేనివారు చదువుకోవటానికి పుస్తకాలు ఉన్నాయా? అనే. అదృష్టం కొద్దీ అక్కడ మందం కాగితం మీద ఉబ్బెత్తుగా, తాకితే తెలిసేలా అక్షరాలతో కూడిన పుస్తకాలున్నాయి. ఈ లిపి వ్యవస్థను బడి వ్యవస్థాపకులు వాలెంటీన్ హాయ్ కనుగొన్నారు. ఆ బడిలో 14 పుస్తకాలే అందుబాటులో ఉండేవి. బ్రెయిలీ వాటన్నింటినీ చదివేశాడు. అయితే అక్షరాలు పెద్దగా ఉండటం వల్ల పుస్తకాలూ పెద్దగానే ఉండేవి. గుడ్డిలో మెల్లలా ఇది కొంతవరకు నయమే గానీ చదవటానికే పనికొచ్చేవి. రాయటానికి వీలయ్యేది కాదు. ఉబ్బెత్తు అక్షరాలను ముద్రించటానికి పెద్ద ప్రింటింగ్ ప్రెస్ అవసరమయ్యేది. పాఠాలను వల్లె వేసుకోవటానికి నోట్స్ రాసుకోవటం కుదిరేది కాదు. అందుకే అంధుల కోసం సరళమైన, చవకైన కొత్త లిపి అవసరమని గుర్తించాడు.
మాజీ సైనికాధికారి ప్రభావంతో..
రాయల్ ఇన్‌స్టిట్యూషన్‌లో చేరిన రెండో సంవత్సరంలో బ్రెయిలీ జీవితం కొత్త మలుపు తిరిగింది. అప్పుడే మాజీ సైనికాధికారి చార్లెస్ బార్బియర్ తోడు దొరికింది. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అంధులు తేలికగా పుస్తకాలు చదువుకోవటానికి, రాసుకోవటానికి గడిలో ఉబ్బెత్తు అక్షరాలతో కూడిన విధానాన్ని రూపొందించాడు. ఒకో అక్షరం రెండు అంకెలకు సూచిక. వీటిని రెండు వరుసల చుక్కలతో రాసుకోవచ్చు. వేలితో చుక్కలను తాకుతూ, వాటిని లెక్కపెట్టుకుంటూ అక్షరాలను ఊహించుకోవటం దీనిలోని కీలకాంశం. దీంతో చదువుకోవటమే కాదు.. వేరే కాగితం మీద గుర్తులనూ పెట్టుకోవటానికి వీలయ్యేది. వీటిని ఇతర అంధులూ చదువుకోవచ్చు. నిజానికి ఈ లిపికి మూలం నైట్ రైటింగ్. దీనికి ఆద్యుడు 19వ శతాబ్దానికి చెందిన చార్లెస్ బార్బియర్. స్పర్శ ద్వారా చీకట్లోనూ సైనికులు సమాచారాన్ని తెలుసుకోవటం కోసం దీన్ని రూపొందించారు. ఆయనే 1821లో రాయల్ ఇన్‌స్టిట్యూషన్‌కు గడులు, చుక్కల వ్యవస్థను పరిచయం చేశారు.
ఈ విధానంలో చదువుకున్న తొలి విద్యార్థుల్లో బ్రెయిలీ ఒకరు కావటం గమనార్హం. ఇందులో 12 ఉబ్బెత్తు చుక్కలతో 36 రకాల శబ్దాలను సృష్టించేవారు. బార్బియర్ విధానం గొప్పతనాన్ని బ్రెయిలీ త్వరలోనే అవగతం చేసుకున్నారు. దీన్ని మరింత మెరుగుపరచే అవకాశమూ ఉందని గుర్తించారు. దీంతో ఎన్నో ప్రయోగాలు చేశారు. దీన్ని సులువుగా, అందరికీ ఉపయోగపడేలా మార్చటానికి నిరంతరం ప్రయత్నించారు. ఉబ్బెత్తు చుక్కలతోనే అక్షరాల లిపిని రూపొందించారు. ఇదే బ్రెయిలీ లిపిగా స్థిరపడింది. దీని రూపకల్పన 1824లోనే పూర్తయినా తొలి పుస్తకాన్ని ముద్రించటానికి ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది. ఆయన 1837లో ముద్రించిన పుస్తకం ఇప్పటికీ వాడుకుంటుండటం విశేషం.
ప్రతి గడిలో 1-6 వరకు నిర్ణీత సంఖ్యలో ఉబ్బెత్తు చుక్కలను ఒక క్రమంలో అమర్చటం ఇందులోని కీలంకాశం. చుక్కల సంఖ్య, వాటి అమరిక ఒకో అక్షరానికి సంకేతాలు. వీటిని వేలితో తాకుతూ అక్షరాలను, పదాలను పోల్చుకోవచ్చు. తేలికగా, వేగంగా చదవొచ్చు. ఈ విధానాన్ని బ్రెయిలీ అక్షరాలకే పరిమితం చేయలేదు. పియానోలాంటి ఆర్గన్ వాద్యాన్ని వాయించటంలో నిపుణుడైన ఆయన సంగీతం నొటేషన్స్ కూడా రాశారు. అక్షరాలు, విరామ చిహ్నాల వంటివే కాదు ఉబ్బెత్తు గీతలు లేదా చుక్కల వరుసలతో బొమ్మలు, గ్రాఫ్‌లను కూడా బ్రెయిలీ లిపిలో తయారు చేయొచ్చు. కాకపోతే ఈ చుక్కలు బ్రెయిలీ లిపి కన్నా పెద్దగా ఉంటాయి.