నదులు, సముద్రాల్లో అప్పుడప్పుడు కలప దుంగలు తేలియాడుతుండటం చూసే ఉంటారు. ఇవి జలాల్లో తేలియాడుతున్నప్పుడు పక్షులు సేద తీరటానికి, చేపల వంటి జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంటాయి. షిప్‌వార్మ్, బ్యాక్టీరియా వంటివి వీటిని కుళ్లిపోయేలా చేసి పోషకాలుగా మార్చేస్తుంటాయి. దీంతో అక్కడి జీవులకు ఆహారమూ లభిస్తుంది. కొన్నిసార్లు ఇవి తీరాలకు కొట్టుకొని వస్తుంటాయి. ఇవి ఇసుక మేటలకు పునాదిగానూ నిలుస్తుంటాయి. ఇలాంటి దుంగలను చాలావరకు కాల్చేయటమో, చెత్తకుప్పలుగా వదిలేయటమో చేస్తుంటారు. మనమంటే వీటిని చూసీ చూడనట్టు వదిలేస్తుండొచ్చు గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. వ్యర్థాలను కూడా అర్థంగా మార్చటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. నెదర్లాండ్ శాస్త్రవేత్త అబ్దుల్లా ఖతార్నే, బృందం కూడా ఇలాగే విభిన్నంగా ఆలోచించింది. కొట్టుకొచ్చిన కలప దుంగలను ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ పరిజ్ఞానంలో వాడే కార్బన్‌కు ముడిపదార్థంగా మలచటంలో విజయం సాధించారు.
దుంగలను ముందుగా హైడ్రోథర్మల్ కార్బనైజేషన్ ప్రక్రియతో శుద్ధి చేశారు. ఇందులో భాగంగా వీటిని నీటిలో ముంచి, ఒత్తిడికి గురిచేశారు. హైడ్రోచార్ అనే గట్టి కర్బనంగా మారేంతవరకు 200 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత వద్ద వేడిచేశారు. ఈ హైడ్రోచార్‌ను అత్యధిక.. అంటే 1400 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతకు గురిచేసి హైడ్రోకార్బన్ పదార్థంగా మార్చారు. దీన్ని సామర్థ్యాన్ని సోడియం అయాన్ బ్యాటరీల్లో పరీక్షించి చూడగా.. బ్యాటరీలు మరింత సమర్థంగా పనిచేయటం విశేషం.