ఆగస్టు నెలలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్ వివరాలు మీకోసం..
మైక్రోమాక్స్ ఇన్ 2బీ..
మైక్రోమాక్స్ బడ్జెట్ శ్రేణిలో రెండు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టనుంది. మైక్రోమాక్స్ ఇన్ 2బీ, ఇన్ 2బీబీ పేరుతో వీటిని తీసుకురానుంది. హై-రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఇన్ 2బీని జులై 30న మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. దీని ధర రూ.15,000 లోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఇన్ 2బీబీ మోడల్‌ను ఆగస్టు రెండు లేదా చివరి వారంలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇవేకాకుండా మైక్రోమాక్స్ 5జీ ఫోన్‌ను కూడా తీసుకురానుంది. అయితే దీని విడుదల, ఫీచర్లకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.
మోటోరోలా..
మోటోరోలా కూడా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను ఆగస్టులో విడుదల చేయనుంది. వీటిలో ఒక ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. వెనక వైపు మూడు కెమెరాలు ఇస్తున్నారట. దీని ధర సుమారు రూ. 20,000 ఉండొచ్చని సమాచారం. మరో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 879 ప్రాసెసర్ ఉపయోగించారట. దీని ధర సుమారు రూ. 25,000 ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ మోడల్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో విడుదల చేయనున్నారు.
రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్..
ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉపయోగించారట. హై-రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఇస్తున్నారని సమాచారం. వెనకవైపు మూడు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. దీని ధర రూ. 25,000 వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఈ మోడల్ గేమ్ ఛేంజర్ అవుతుందని రియల్‌మీ భావిస్తోంది. దీనితోపాటు మైక్రోమాక్స్ ఇన్, రెడ్‌మీ 10 సిరీస్ వేరియంట్లకు పోటీగా బడ్జెట్ ధరలో రియల్‌మీ సీ సిరీస్ పేరుతో కొత్త మోడల్స్‌ను తీసుకురానుంది. వీటిని ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది.
గూగుల్ పిక్సెల్ 6 సిరీస్..
గతంలో వచ్చిన పిక్సెల్ మోడల్స్‌కు భిన్నంగా గూగుల్ పిక్సెల్ 6 , 6ప్రో మోడల్స్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో గూగుల్ వైట్‌ఛాపెల్ చిప్‌సెట్‌ను ఉపయోగించారని సమాచారం. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్/ 512జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో విడుదల చేయనున్నారు. వీటి ధర సుమారు రూ. 55,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆగస్టు రెండో వారంలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.