తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

దారి చూపే గురువు.. సాయం చేసే నేస్తం.. అన్ని పనులకూ ఏఐ చాట్‌ బాట్‌! - గూగుల్ సెర్చింజిన్​కు బదులు ఏఐ చాట్‌ బాట్‌

మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్​లో వెతుకుతాం. సెర్చింజిన్‌లో ఓ పదం టైప్‌ చేసి వచ్చిన ఫలితాల నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటున్నాం. కానీ మనకు సమాచారం పరిపూర్ణంగా లభించదు. ఇలాంటి సమస్య లేకుండా ఏ విషయం గురించైనా సమాచారం ఇచ్చే చాట్​ బాట్​లు వచ్చేస్తున్నాయి. ఇది ఒక మార్గదర్శిలా, గురువులా, నిపుణుడిలా, సహాయకుడిలా, స్నేహితుడిలా మనకు సమాచారం ఇవ్వడంలో సహాయం చేస్తుంది. మరి అదేంటో, దాని వివరాలేంటో తెలుసుకుందాం.

new AI chat bot technology instead of google  search engine
అన్నింటికీ ఏఐ చాట్‌ బాట్‌

By

Published : Feb 11, 2023, 9:02 AM IST

ప్రియురాలికి చక్కటి ప్రేమలేఖ రాయాలనుకున్నాడు ఓ వ్యక్తి. నిజానికి అతనికి ప్రేమించేందుకు అవసరమైన అద్భుతమైన హృదయం ఉన్నా.. తాను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలియజేసే విషయమై అక్షర రూపం ఇవ్వడంలో అంత నేర్పరి కాదు. వచ్చే వారంలో జరిగే ఫలానా ఉత్సవం సందర్భంగా చక్కటి ప్రసంగం సిద్ధం చేయమని ఓ మంత్రి తన పీఏను ఆదేశించారు. అందుకోసం పీఏ గంటలు గంటలు పుస్తకాలు, అంతర్జాలంలో శోధించాలి. అయినా సరైన నోట్‌ తయారవుతున్న నమ్మకం అంతగా లేదు. ఇలా నిత్యజీవితంలో మనకు అనేక సందర్భాల్లో పలు రకాల అవసరాలు ఉంటాయి. వాటిని నెరవేర్చే విషయంలో సాక్షాత్కరిస్తున్న ఆశా కిరణమే 'చాట్‌ బాట్‌.'

అడిగితే చాలు సంపూర్ణ సమాచారం..
ఇప్పటివరకు మనం సెర్చింజిన్‌లో ఓ పదం టైప్‌ చేసి వచ్చిన ఫలితాల నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటున్నాం. ఏఐ చాట్‌ బాట్‌లు మాత్రం ప్రశ్నను అర్థం చేసుకొని మనకు కావలసిన సమాచారాన్ని అవే రాసిపెడతాయి. చిత్రాలనూ గీస్తాయి.గురువు, మార్గదర్శి, నిపుణుడు, స్నేహితుడు తదితర పాత్రలను ఇవి పోషిస్తాయి. ప్రస్తుతానికి ఏఐ చాట్‌ బాట్‌ల పరిజ్ఞానం పరిపూర్ణమైనది కాదు. సమాధానాలకు కల్పనా చాతుర్యాన్ని జోడిస్తున్నాయి. మరోవైపు, విద్యార్థులు పరీక్షల్లో చాట్‌బాట్‌ను ఉపయోగించి మోసాలకు పాల్పడుతుండడంతో విద్యాసంస్థల్లో చాట్‌ జీపీటీని నిషేధించారు. అదే సమయంలో జనం సమాచారం కోసం గూగుల్‌ సెర్చింజన్‌ మీద కాకుండా ఏఐ చాట్‌ బాట్ల మీద ఆధారపడితే ఆ సంస్థ వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని కోల్పోతుంది. గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫబెట్‌కు ఏటా వచ్చే ఆదాయం 28,300 కోట్ల డాలర్లలో మూడు వంతులు గూగుల్‌ సెర్చ్‌ వాణిజ్య ప్రకటనల ద్వారానే లభిస్తోంది.

మైక్రోసాఫ్ట్‌ X గూగుల్‌
ఓపెన్‌ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్‌ జీపీటీ పెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్‌ బాట్‌ రంగంలో ఆధిక్యం కోసం మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, చైనా వెబ్‌ సంస్థ బైడు పోటీపడడం ఇప్పటికే మొదలైపోయింది. 2022లో ఓపెన్‌ ఏఐ సంస్థలో 100 కోట్ల డాలర్లను పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్‌ మరో 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమకూరుస్తామని ప్రకటించింది. ఇప్పటికే చాట్‌ జీపీటీని మైక్రోసాఫ్ట్‌ సెర్చింజిన్‌ బింగ్‌లోనూ, టీమ్స్‌ సాఫ్ట్‌వేర్‌లోనూ అంతర్భాగం చేశారు. అది త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లోనూ సాక్షాత్కరించి, మీ కోసం పేరాలకు పేరాలు రాసిపెట్టనుంది. అవుట్‌లుక్‌లో మీ ఈ-మెయిల్స్‌ను లిఖిస్తుంది. పవర్‌ పాయింట్‌లో దృశ్యశ్రవణ సమర్పణలకు తోడ్పడుతుంది. గూగుల్‌ సెర్చింజన్‌కు ఏఐ చాట్‌ బాట్‌ లామ్డాను జతపరచనున్నారు. ఈ చాట్‌ బాట్‌కు బార్డ్‌ అని నామకరణం చేశారు. చైనీస్‌ కంపెనీ బైడు మార్చిలో తన చాట్‌బాట్‌ను విడుదల చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details