New 12 Rockets Set To Launch In 2024 : జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ ఇచ్చిన ప్రేరణతో ప్రపంచ దేశాలు మరిన్ని పరీక్షలకు సిద్ధమయ్యాయి. నెలరాజు గుట్టువిప్పేందుకు 2024 ఒక్క సంవత్సరంలోనే దాదాపు 12 ప్రయోగాలు జరగనున్నాయి. చంద్రుడి రహస్యాలు తెలుసుకునేందుకు ఒక్క ఏడాదిలో జరిగే అత్యధిక ప్రయోగాలు ఇవే. జనవరి నెలలోనే ప్రపంచవ్యాప్తంగా మూడు ప్రయోగాలు జరగనున్నాయి.
అందరికంటే ముందుగా జపాన్
వచ్చే ఏడాదిలో జనవరి 19న జపాన్ అందరికంటే ముందుగా జాబిల్లిపై అడుగుపెట్టేందుకు ప్రయోగం చేపట్టనుంది. SLIM మిషన్‌ను ప్రయోగించి విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన ఐదో దేశంగా నిలవాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాకు చెందిన యునైటెడ్ లాంచ్ అలయన్స్ సంస్థ కూడా ఆస్ట్రోబోటిక్ పెరెగ్రైన్ లూనార్ ల్యాండర్‌ను జనవరిలోనే ప్రయోగించాలని నిర్ణయించింది. చైనా తన చాంగ్ ఈ-6 మిషన్‌ను మే నెలలో చేపట్టనుంది. 2020లో చైనా చేపట్టిన చాంగ్ ఈ-5 విజయవంతంగా చందమామ ఉపరితలంపై దిగింది. చాంగ్ ఈ 5 సేకరించిన శాస్త్రీయ నమూనాలను తిరిగి చాంగ్ ఈ6తో చంద్రునిపైకి డ్రాగన్ పంపనుంది.
9వేల కిలోమీటర్ల దూరంలో
మానవులను జాబిల్లికి తీసుకెళ్లే ఆర్టెమిస్ 2 మిషన్‌ను అమెరికా నవంబరులో చేపట్టనుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి, 2026 లేదా 2027లో తిరిగి భూమికి రానున్నారు. ఏరియన్ 6 ప్రయోగం కూడా అదే ఏడాది(2024) మధ్యలో ఐరోపా చేపట్టే అవకాశం ఉంది.