తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనిషి, త్వరలోనే నాసా ప్రయోగం - నాసా ఆర్టెమిస్ న్యూస్

50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలుమోపే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్టెమిస్‌ 1 మిషన్‌లో భాగంగా ఆగస్టు 29వ తేదీన నాసా మూన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 98 మీటర్లు పొడవున్న ఈ భారీ రాకెట్‌ను ఇప్పటికే లాంచ్‌పాడ్‌కు తరలించారు. ఆర్టెమిస్‌ 1 ద్వారా డమ్మి బొమ్మలను పంపి ప్రయోగ ఫలితాలను నాసా పరిశీలించనుంది. అనంతరం 2024లో ఆర్టెమిస్‌ 2 మిషన్‌ ద్వారా అంతరిక్ష యాత్రికులను చంద్రుని కక్ష్యలోకి ఆ తర్వాత 2025లో ఆర్టెమిస్‌-3 ద్వారా జాబిల్లిపైకి పంపనుంది.

NASA MOON MISSION
NASA MOON MISSION

By

Published : Aug 18, 2022, 3:42 PM IST

NASA Artemis mission: చంద్రుడిపై మనిషి కాలుపెట్టి అర్ధశతాబ్దం దాటింది. తొలిసారిగా 1969లో అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్‌ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలుమోపారు. ఆ తర్వాత ఎవ్వరు కూడా జాబిల్లిపై అడుగుపెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది.

NASA moon mission 2024: ఈసారి మూన్ మిషన్‌కు 'ఆర్టిమిస్ ప్రోగ్రామ్' అని నాసా పేరు పెట్టింది. ఆర్టిమిస్ అంటే గ్రీకు పురాణాల్లో ఒక దేవుడైన అపోలోకు కవల సోదరి. ఆ పురాణం ప్రకారం ఆమె 'మూన్ గాడెస్' కూడా. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది. చంద్రుడి మీదకు నాసా సిద్ధం చేసిన ఆర్టెమిస్‌-1ను ఆగస్టు 29వ తేదీన ప్రయోగించనున్నారు. ఇక ఆర్టెమిస్‌-2 మిషన్‌ 2024లో, ఆర్టెమిస్‌-3 మిషన్‌ 2025లో ఉండొచ్చని నాసా చెబుతోంది.

ప్రయోగం కోసం సిద్ధం చేసిన రాకెట్

NASA Artemis 1 launch date: 98 మీటర్లు పొడవున్న నాసా మూన్‌ రాకెట్‌ను.. కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని తయారీ భవనం నుంచి భారీ ట్రక్ మీద పెట్టి ‌లాంచ్ పాడ్ 39బికి తరలించారు. 322 అడుగుల పొడవున్న ఈ రాకెట్‌ను 4 మైళ్ల దూరం తరలించడానికి సుమారు 10 గంటల సమయం పట్టింది. తొలుత వ్యోమగాములు, సిబ్బంది ఎవరూ రాకెట్‌లో లేకుండా దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. రేడియేషన్, వైబ్రేషన్‌ను కొలవడానికి సెన్సార్‌లతో మూడు డమ్మి బొమ్మలను పంపనున్నారు.

.

వ్యోమగాములు ఉండే క్రూ కాప్స్యూల్.. ఓరియాన్‌ను చంద్రుడి వెనుక కక్ష్యలోకి పంపించి.. అక్కడి నుంచి తిరిగి భూమి మీదకు రప్పించటం, కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ సముద్రంలోకి పడేలా చేయటం ఈ ప్రయోగంలో నాసా శాస్త్రవేత్తల లక్ష్యం. 6 వారాల పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఓరియాన్ కాప్స్యూల్‌ హీట్‌షీల్డ్.. భూమి మీదకు తిరిగి ప్రవేశించేటపుడు ఆ వేడిని తట్టుకోగలదా లేదా అన్నది పరీక్షించటం ఈ ప్రయోగంలో ఒక ప్రధాన ఉద్దేశం. 2024లో ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా వ్యోమగాములను నాసా చంద్రుని కక్ష్యలోకి పంపనుంది. ఆ తర్వాత 2025లో ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా మళ్లీ మనుషులు చంద్రుడు మీద దిగుతారని తెలిపింది. ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా చంద్రుడి మీద తొలి మహిళ పాదం మోపుతారని నాసా ఇప్పటికే హామీ ఇచ్చింది.

.

మిషన్ మార్స్​లో భాగంగానే..
2030ల నాటికి అంగారకుడి మీదకు అంతరిక్ష యాత్రికులను పంపించటానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. అపోలో మిషన్ల కోసం ఉపయోగించిన సాటర్న్ 5 రాకెట్ల కన్నా కొత్త ఎస్‌ఎల్ఎస్ రాకెట్లకు 15 శాతం అధిక పీడనం లభిస్తుంది. ఈ అదనపు శక్తితో పాటు ఇతర ఆధునిక సాంకేతికతలు కలిసినపుడు.. ఈ వాహనం కేవలం వ్యోమగాములను మాత్రమే కాకుండా.. వారు ఎక్కువ కాలం పాటు భూమికి దూరంగా ఉండటానికి అవసరమైన పరికరాలు, సరకులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లగలదు. ఇక వ్యోమగాములు ఉండే క్రూ కాప్స్యూల్ ఓరియాన్‌ సామర్థ్యం కూడా పెరిగింది. 1960లు, 70ల నాటి కమాండ్ మాడ్యూళ్లతో పోలిస్తే.. ఓరియాన్ వెడల్పు మరో మీటరు పెరిగింది. దీని వెడల్పు 5 మీటర్లుగా ఉంది.

ఆర్టిమిస్ 1‌ను ప్రయోగం కోసం సంసిద్ధం చేయటానికి కేవలం పది రోజుల సమయమే ఉంది. ప్రతికూల వాతావరణం వల్ల రాకెట్‌ను ప్రయోగించలేకపోతే.. సెప్టెంబర్ 2వ తేదీన లేదా సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రయోగించటానికి ప్రయత్నిస్తారు. ఈ మిషన్‌లో యూరప్ కూడా కీలక భాగస్వామిగా ఉంది. ఓరియాన్ కాప్స్యూల్‌ను అంతరిక్షంలో ముందుకు నడిపించే ప్రొపల్షన్ మాడ్యూల్‌ను యూరప్ అందిస్తోంది. ఎస్ఎల్ఎస్ రాకెట్ల తొలి నాలుగు మిషన్ల కోసం 400 కోట్ల డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చవుతుందని అంచనా.

ABOUT THE AUTHOR

...view details