మోటొరోలా నుంచి మోటో వాచ్ 100 పేరుతో(moto watch 100) స్మార్ట్ వాచ్ రాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. వృత్తాకార డిస్ప్లేతో నల్ల రంగులో, చారల బెల్టు ఉన్న ఈ వాచ్ ఆకర్షణీయంగా ఉంది. ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు గానీ.. ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఈ అధునాత స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ , స్టెప్స్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్‌తో పాటు జీపీఎస్ సపోర్ట్ కూడా ఉండనుందని తెలుస్తోంది. సింపుల్ డిజైన్‌తో ఆకర్షిణీయంగా ఉన్న ఈ వాచ్ ఫీచర్లు(moto watch 100 features) ఓసారి చూద్దాం.
- వృత్తాకారంలో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్‌కు రెండు బటన్లు ఉన్నాయి.
- ఇది వాటర్‌ఫ్రూఫ్
- 360x360 పిక్సెల్ రిజల్యుషన్‌తో 1.3 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- 355mAh బ్యాటరీ
- ఇన్‌బిల్ట్ జీపీఎస్
- హార్ట్ రేట్ సెన్సార్, యాక్సలెరోమీటర్, జైరొస్కోప్, SpO2 సెన్సార్.
- స్లీప్ ట్రాకింగ్, సెన్సార్ కౌంటింగ్
29 గ్రాములు బరువుంటుందని ప్రచారం జరుగుతున్న ఈ స్మార్ట్‌వాచ్ బ్యాటరీ జీవితకాలం తెలియాల్సి ఉంది. నలుపుతోపాటు ఇతర రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. అయితే ఈ వాచ్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? అనే విషయంపై మోటొరోలా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు స్మార్ట్‌వాచ్ వస్తుందా? లేదో కూడా స్పష్టత లేదు.
త్వరలో రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో..
రెడ్మీ బ్రాండ్‌తో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో మార్కెట్లో అదరగొడుతున్న షావోమీ.. రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోను(redmi smart band pro) కూడా త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. చైనాలో గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో రెడ్మీ వాచ్ 2, రెడ్మీ వాచ్ 2 లైట్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. వీటికి భారత్‌లో బీఐఎస్ సర్టిఫికేట్ కూడా లభించినట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 30 రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది(redmi smart band pro features).