ప్రస్తుత కాలంలో చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తారు. యాపిల్ ఫోన్లతో పోలిస్తే.. తక్కువ ధర, యూజర్ ఫ్రెండ్లీ.. ఇలా అంశాలేవైనా అండ్రాయిడ్ ఫోన్లను వినియోగించడానికి చాలామంది ఇష్టపడపుతున్నారు. మన ఫోన్లో ఎన్నో యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని వాడుతుంటాం. అయితే చాలా మందికి తెలియని.. మోస్ట్ యూజ్ ఫుల్ 12 యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యాక్షన్ బ్లాక్స్ (గూగుల్) :ఇప్పటిదాకా మీరు వినని గూగుల్ యాప్స్‌లో ఇదొకటి! గూగుల్ అసిస్టెంట్ సాయంతో మన రోజువారీ పనులు, టాస్క్‌లను సులభతరం చేస్తుంది. అసిస్టెంట్ వాయిస్ కమాండ్‌తో ఇది పనిచేస్తుంది. సింగిల్ ట్యాప్‌తో మన పనులన్నీ అయిపోయేలా చేస్తుంది. ఇందుకోసం ముందుగా.. మొబైల్ హోమ్ స్క్రీన్‌పై ఒక యాక్షన్ బ్లాక్ క్రియేట్ చేసి మనం చేయాలనుకున్న పనిని అందులో యాడ్ చేయాలి. ఇవి మనకు షార్ట్ కట్స్ లాగా ఉపయోగపడతాయి. దాన్ని ట్యాప్ చేసి మన పనిని చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక్క ట్యాప్‌తో మ్యూజిక్ ప్లే చేయడం, ఫోన్ చేయడం, మెసేజ్ పంపిచండం వంటివి చేయవచ్చు.
రిమోట్ డెస్క్‌టాప్ : మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసిన ఈ యాప్‌తో మన డెస్క్‌టాప్, వర్క్ సర్వర్లతో మన ఫోన్లోని డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఒక డివైజ్ నుంచి మరొకదానికి టెక్ట్స్‌ను షేర్ చేసుకోవడానికి స్క్రీన్ కాప్చర్, క్లిప్ బోర్డు యాక్సెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ యాప్ మీ పనిని సులభతరం చేయడమే కాకుండా డివైజ్‌లను మార్చేటప్పుడు శ్రమను తగ్గిస్తుంది.
వికిమీడియా కామన్స్ : మనందరికీ వికిపీడియా తెలుసు కానీ ఈ వికిమీడియా ఏంటి అని అనుకుంటున్నారా..? ఇదొక ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్టు. ఇందులో చిత్రాలు ఉచితంగా అప్ లోడ్, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వివిధ రకాల కేటగిరీల్లో వందల కొద్ది మల్టీమీడియా చిత్రాలుంటాయి. వీటిని మీ బ్లాగులు, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
ట్రాకర్ డిటెక్ట్ : యాపిల్ కంపెనీ తయారు చేసిన ఈ యాప్.. మన వ్యక్తిగత భద్రతకు సంబంధించింది. ఇది మీరు ట్రాకర్లను కనుగొనటానికి సహాయపడుతుంది. ఉదాహరణకు ఎవరైనా ఇరత వ్యక్తులు ఎయిర్ ట్యాగ్, ఇతర డివైజ్‌ను ఉపయోగించి మీ లొకేషన్‌ను తెలుసుకోవాలనుకుంటే.. దీని ద్వారా స్కాన్ చేసి ఈజీగా కనుక్కోవచ్చు.
ఓపెన్ డోర్స్ : ఇది ట్రూ కాలర్ అప్లికేషన్ నుంచి వచ్చిన యాప్. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, సంప్రదాయాల మనుషుల్ని కలుసుకోవడానికి.. వారితో పరిచయాలు పెంచుకుని మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులుండవు.