ఎప్పటికప్పుడు వినూత్న ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న యాపిల్ సంస్థ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే సృష్టించే దిశగా అడుగులేస్తోంది. తాజా వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో (డబ్ల్యూడబ్ల్యూడీసీ 21) యాపిల్ ప్రకటించిన అప్‌డేట్స్‌ను చూస్తే ఇదింకెంతో దూరంలో లేదనే తోస్తోంది. కొత్త ఐఓఎస్15, ఐప్యాడ్‌ఓఎస్15, మ్యాక్‌ఓఎస్ మాంటెరే, వాచ్‌ఓఎస్ 8 పరికరాల భవిష్యత్ శక్తిని ఈ వాస్తవిక కాల్పనిక సమావేశం కళ్లకు కట్టింది. వీటికి సంబంధించి రోజుకో కొత్త సంగతి బయటపడుతోంది.
సంగీతం, సినిమాలు కలివిడిగా..
చాలా యాప్స్‌లో అతి ముఖ్యమైన అంశం షేర్ చేసుకునే వీలుండటం. ఉదాహరణకు- ఫేస్‌టైమ్ కాల్ చేస్తున్నప్పుడూ ఇష్టమైన సంగీతం వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. యాపిల్ మ్యూజిక్‌లో పాటను వింటూ దాన్ని షేర్‌ప్లే ద్వారా షేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎవరైనా పాజ్ చేయొచ్చు. తర్వాత పాటలోకి జంప్ చేయొచ్చు. యాపిల్ టీవీ వీడియోలనూ ఇలాగే షేర్ చేసుకోవచ్చు. ఒక్క వీటినే కాదు.. డిస్నీ ప్లస్, ట్విచ్, మాస్టర్‌క్లాస్ వంటి స్ట్రీమింగ్ సర్వీసుల వీడియోలనూ షేర్‌ప్లే చేసుకోవచ్చు.
గోప్యతకు పెద్ద పీట
కొత్త అప్‌డేట్స్‌లో అన్నింటికన్నా ముఖ్యమైంది కట్టుదిట్టమైన గోప్యత (ప్రైవసీ). యాప్స్ తమ గురించి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయో ఐఓఎస్ 15 ఎప్పటికప్పుడు పసిగడుతుంది. ఫొటో ఆల్బమ్, కాంటాక్ట్ జాబితా, మైక్రోఫోన్ వంటి వాటిపై యాప్స్ పైచేయి సాధిస్తే వెంటనే తెలియజేస్తుంది. ఇలా ఆయా కంపెనీల ప్రకటనల కోసం తమను ట్రాక్ చేయొచ్చో లేదో నిర్ణయించుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. ఐపీని ట్రాక్ చేయకుండా యాప్ ట్రాకింగ్ ట్రాన్స్‌పరెన్సీ అడ్డుకుంటుంది మరి. ఇది ట్రాకర్లకు ఐపీ చిరునామా కనిపించకుండా చేస్తుంది. మరో భారీ మార్పు మెయిల్ యాప్. కొన్ని మెయిల్ సందేశాలు పిక్సెల్స్ ద్వారా మనల్ని ట్రాక్ చేస్తుంటాయి. మెయిల్ ఇకపై డిఫాల్ట్‌గా ఐపీ అడ్రస్ వీటికి చిక్కకుండానూ చేసేస్తుంది.
మరింత అనువుగా ఫేస్‌టైమ్
కరోనా విజృంభణ నేపథ్యంలో యాపిల్ ఎప్పటికప్పుడు ఫేస్‌టైమ్‌లో కొత్త మార్పులు తెస్తూనే ఉంది. వీడియో సమావేశంలో ఉన్నప్పుడు ఏదైనా కాల్ వస్తే వీడియో చాట్ చేయటం, లింక్స్ షేర్ చేసుకోవటం వంటివి వీటిల్లో కొన్ని. యాపిల్ ఇక్కడితోనే ఆగిపోవటం లేదు. ఆండ్రాయిడ్, విండోస్ పరికరాలు వాడేవారు సైతం ఈ లింక్స్‌ను వెబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవటానికీ వీలు కల్పించనుంది. దృశ్యాలు, మాటలు మరింత స్పష్టంగా, ‘సజీవ’ంగా ఉండే విధంగానూ తీర్చిదిద్దనుంది. స్పేషియల్ ఆడియో ఫీచర్ మూలంగా ఫేస్‌టైమ్ కాల్స్‌లో పాల్గొంటున్నవారు మన గదిలో ఉన్నారేమో అనే భావన కల్గిస్తుంది. అంటే స్క్రీన్‌కు కుడివైపున ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే కుడి వైపు స్పీకర్ నుంచి మాటలు వినిపిస్తాయి. వెనక దృశ్యాలను మసక బరచి మాట్లాడుతున్నవారే స్పష్టంగా కనిపించేలా చేసే సదుపాయమూ రానుంది.
ఒకేసారి మ్యాక్‌తో ఇతర పరికరాలూ..
యూనివర్సిటీ కంట్రోల్ యాప్ మరో అధునాతన పరిజ్ఞానం. నమ్మకమైన యాపిల్ వినియోగదార్లకిది సంతోషాన్ని కలిగిస్తుందనటం నిస్సందేహం. మ్యాక్‌ఓఎస్ మాంటెరే తాజా వర్షన్‌లో ఇదో మంచి అప్‌డేట్. దీంతో ఒకే సమయంలో మ్యాక్‌బుక్, ఐప్యాడ్ వంటి ఇతర యాపిల్ పరికరాలనూ వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ఐఫోన్‌లో ఏదో వార్తను చూస్తున్నారనుకోండి. కావాలంటే దీన్ని మ్యాక్‌బుక్‌లోనూ చదువుకోవచ్చు. లేదూ ఐప్యాడ్ నుంచి ఐమ్యాక్‌లోకి లింకును కాపీ చేసుకోవచ్చు. యూనివర్సిటీ కంట్రోల్ ద్వారా ఒకే మౌజ్ లేదా కీబోర్డుతో వివిధ యాపిల్ పరికరాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక పరికరం నుంచి మరో పరికరంలోకి ఫైళ్లను డ్రాగ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫొటోలతో ఎక్కువగా పనిచేసేవారికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.
మా మంచి ఎయిర్‌పాడ్స్
ఎయిర్‌పాడ్స్ ప్రొలో ‘కన్వర్జేషన్ బూస్ట్’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇది రద్దీ ప్రాంతాల్లోనూ చుట్టుపక్కల శబ్దాల తీవ్రతను తగ్గించేసి, ఎదురుగా ఉన్నవారి మాటలు స్పష్టంగా వినపడేలా చేస్తుంది. ఎయిర్‌పాడ్స్ ప్రొ, ఎయిర్‌పాడ్స్ మాక్స్‌లను ఎక్కడ పెట్టామో మరచిపోతే ఫైండ్ మై నెట్‌వర్క్ ద్వారా ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చు.
తాళం చెవులకు చెల్లు!
తాళం చెవులు ఎక్కడో పెట్టటం, మరచిపోవటం తరచూ ఎదుర్కొనేది. ఇకపై ఐఫోన్ వినియోగదార్లకు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఇల్లు, ఆఫీసు, హోటల్.. వేటి తలుపులనైనా డిజిటల్ కీస్‌తోనే తేలికగా తెరిచేందుకు మార్గం సుగమం కానుంది! వచ్చే మూడు, నాలుగు నెలల్లో వెయ్యికి పైగా హోటళ్లలో ఈ పరిజ్ఞానాన్ని ఆరంభించాలని హయత్ హోటల్స్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది కూడా.