ఆన్‌లైన్ భద్రతకు సంబంధించి యూజర్స్‌కు మెరుగైన సేవలందించడం కోసం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట మైక్రోసాఫ్ట్ యూజర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు పాస్‌వర్డ్ అవసరంలేదని తెలిపింది. ఈ మేరకు యూజర్స్ అంతా పాస్‌వర్డ్‌కు బదులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్, విండోస్ హలో లేదా ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్ ద్వారా వచ్చే కోడ్‌లతో లాగిన్ కావాలని సూచించింది. ఇది పాస్‌వర్డ్ కంటే సురక్షితమైన పద్ధతని మైక్రోసాఫ్ట్(Microsoft) తెలిపింది. ఔట్‌లుక్, వన్‌డ్రైవ్, మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సేఫ్టీ, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్‌తోపాటు అన్ని రకాల మైక్రోసాఫ్ట్ సేవలు పొందేందుకు ఇక మీదట పాస్‌వర్డ్ అవసరంలేదని వెల్లడించింది. అక్టోబరు 5న కొత్త ఓఎస్ విండోస్ 11ను విడుదలచేయనున్న నేపథ్యంలో అంతకుముందే ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.
మైక్రోసాఫ్ట్(Microsoft) అథెంటికేటర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్స్ తమ ఖాతాలను పాస్‌వర్డ్‌లెస్‌కు మార్చుకోవచ్చు. ముందుగా మీ ఖాతాని అథెంటికేటర్ యాప్‌తో అనుసంధానించాలి. తర్వాత మీ మైక్రోసాఫ్ట్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీలో పాస్‌వర్డ్‌లెస్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేయాలి. తర్వాత అథెంటీకేటర్ యాప్‌లో వచ్చే నోటిఫికేషన్లను ఓకే చేస్తూ మీ ఖాతాలోకి లాగిన్ కావచ్చు. ఒకవేళ మీరు తిరిగి పాస్‌వర్డ్ కావాలనుకుంటే ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌లెస్ ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది. అయితే పాస్‌వర్డ్‌తో కంటే పాస్‌వర్డ్‌లెస్‌తోనే ఆన్‌లైన్ ఖాతాలకు ఎక్కువ భద్రత ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.