వెబ్ బ్రౌజింగ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల విలువైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంది. యూజర్ గోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా వెబ్ బ్రౌజింగ్ సంస్థలు పటిష్ఠమైన ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అయిన కూడా యూజర్ సమాచారం లక్ష్యంగా హ్యాకర్స్ దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్ విహారం మరింత భద్రంగా సాగేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో 'సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్' (ఎస్‌డీఎస్‌ఎమ్) పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు జావా స్క్రిప్ట్‌లో జస్ట్-ఇన్-టైమ్ (జేఐటీ) కంపైలేషన్‌ను డిసేబుల్ చేసి వెబ్ బ్రౌజింగ్‌కు మరింత రక్షణ కల్పించడం ఈ సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్ ప్రధాన ఉద్దేశం.
వెబ్ బ్రౌజింగ్‌లో జావా స్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. కానీ ఇందులోని జేఐటీ ద్వారా 45 శాతం హ్యాకింగ్ ముప్పు ఉందని సైబర్ నిపుణులు అంటున్నారు. అందుకే జేఐటీ కంపైలేషన్‌ను డిసేబుల్ చేస్తే జావా స్క్రిప్ట్‌లోని సగానికి పైగా బగ్స్‌ని అడ్డుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌కి చెందిన జొనాథన్ నార్మన్ అనే సైబర్ నిపుణుడు తెలిపారు. అయితే పరీక్షల దశలో జేఐటీ కంపైలేషన్‌ను డిసేబుల్ చేయడం వల్ల కొన్నిసార్లు బ్రౌజింగ్ పనితీరు నెమ్మదించడం, మరికొన్ని సందర్భాల్లో మెరుగ్గా ఉన్నట్లు గుర్తించామని మైక్రోసాఫ్ట్ బృందం వెల్లడించింది. ఎడ్జ్‌లో సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్‌తో పాటు ఆర్బిటరీ కోడ్ గార్డ్ (ఏసీజీ) అనే కొత్త ఫీచర్‌ను కూడా భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ తీసుకురానుంది. దీనివల్ల ఎడ్జ్ బ్రౌజర్‌కి అదనపు రక్షణ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న సూపర్ డూపర్ సెక్యూర్ మోడ్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఎడ్జ్ బీటా యూజర్స్‌కి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.