ఇంటర్నెట్ సెర్చింగ్‌ను సమూలంగా మార్చేసే ఏఐ చాట్బాట్లు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. దిగ్గజ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ చాట్‌బాట్లను విడుదల చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఓపెన్ ఏఐ అనే సంస్థ తయారు చేసిన చాట్‌జీపీటీ.. తొలుత ఈ సంచలనాలకు తెరతీసింది. ఒక్కసారిగా టెక్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిందీ ఏఐ బాట్. ఇంటర్నెట్లో భవిష్యత్ అంతా వీటిదేనని తెగ చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాప్ కంపెనీలు హడావుడిగా వీటిని మార్కెట్లోకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ హడావుడిలోనే బొక్కబోర్లా పడుతున్నాయి. ఇటీవల గూగుల్‌కు ఇలాంటి ఎదురుదెబ్బ తగలగా.. తాజాగా మైక్రోసాఫ్ట్ వంతైంది.
అసలేమైందంటే?
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఏఐ చాట్‌బాట్ 'ChatGPT'. దీన్ని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ అనే సంస్థలో మైక్రోసాఫ్ట్.. 2019లో ఒక బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అంటే.. పరోక్షంగా ఈ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ లీడింగ్‌లోనే ఉంది. అయితే, చాట్‌జీపీటీ ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ కోసం ఈ ఏడాది జనవరిలో మరో 10 బిలియన్ డాలర్లు ఓపెన్ఏఐలో పెట్టుబడిగా పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం మైక్రోసాఫ్ట్‌కు ఓపెన్ఏఐ సంస్థ.. ప్రత్యేక చాట్‌జీపీటీ సేవలను అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్... తన సెర్చ్ ఇంజిన్ అయిన 'బింగ్'తో చాట్‌జీపీటీని అనుసంధానం చేసింది. దానికి 'సిడ్నీ' అని పేరు పెట్టింది. ఈ నెల మొదట్లో దీన్ని విడుదల చేసింది. క్రేజ్ ఉన్న టెక్నాలజీ కాబట్టి యూజర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. 48 గంటల్లోనే పది లక్షల మంది దీన్ని ట్రై చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో ఈ 'సిడ్నీ' చేసిన నిర్వాకం బయటకొచ్చింది.
చంపేస్తానని బెదిరింపులు..
బింగ్ సెర్చ్ చాట్‌బాట్ సిడ్నీ.. దాన్ని టెస్ట్ చేసిన వారికి చుక్కలు చూపించింది. పొంతన లేని సమాధానాలు పక్కనబెడితే.. ఏకంగా చంపేస్తానని యూజర్లను బెదిరించింది. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఏదో ప్రశ్న అడిగిన ఆ ప్రొఫెసర్‌ను చంపేస్తానని బెదిరించింది సిడ్నీ. మరోవైపు, న్యూయార్క్ టైమ్స్‌లో పనిచేసే కెవిన్ రూస్ అనే జర్నలిస్టుకు పెళ్లి ప్రతిపాదన చేసింది. భార్యను వదిలేయాలని కూడా సూచించింది. ప్రస్తుత సంవత్సరం 2023 కాదని.. 2022 అని మరో యూజర్‌ను నమ్మించే ప్రయత్నం చేసింది.
మైక్రోసాఫ్ట్ ఏమందంటే?
చంపేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసినప్పటికీ మైక్రోసాఫ్ట్ మాత్రం సిడ్నీని వెనకేసుకొచ్చింది. సిడ్నీని 169 దేశాల్లోని యూజర్లు టెస్ట్ చేశారని తెలిపింది. అందులో 71 శాతం మంది సానుకూలంగానే స్పందించారని పేర్కొంది. ఎక్కువ సేపు దాన్ని వాడితే ఇలా భిన్నమైన సమాధానాలు ఇస్తోందని వివరణ ఇచ్చింది. 15 కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగితే చాట్‌బాట్ దారితప్పుతోందని తెలిపింది. యూజర్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ తమకు ఉపయోగకరంగా ఉందని, దాని ఆధారంగా చాట్‌బాట్‌ను మరింత మెరుగ్గా, సురక్షితంగా మార్చుతామని స్పష్టం చేసింది.