తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మనకే భూతద్దపు చూపు ఉంటే? - science

భూమ్మీద జీవించేది మనుషులు, జంతువులు, మొక్కలు మాత్రమేనా?  మన కంట కనబడకుండా మరో రకం ప్రాణులు నివసిస్తూ ఉండవా? ఉండటమే కాదు, అలాంటి ప్రాణులు మనతో సహజీవనం కూడా చేస్తున్నాయంటున్నారు విశాలాక్షీఅరిగెల. మైక్రో ఆర్గానిజంలు లేదా మైక్రోబులు అని వ్యవహరించే ఈ సూక్ష్మ ప్రాణులు ఎక్కడ ఎలా జీవిస్తాయో, అవి మన రోజువారీ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆమె వివరిస్తున్నారు.

microorganisms-or-microbes-in-our-day-to-day-life
మనకే భూతద్దపు చూపు ఉంటే?

By

Published : Feb 11, 2021, 3:46 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

అతి చిన్న ప్రాణులను సూక్ష్మజీవులు లేదా మైక్రోబులు అంటారు. ఇవి కంటికి కనబడవు. సూక్ష్మదర్శిని ( మైక్రోస్కోపు) ద్వారా మాత్రమే చూడగలం. అసలు ఈ ప్రాణులేంటి? ఇవెక్కడ జీవిస్తాయి?? మన నిత్య జీవితంలో వీటి పాత్ర ఎలా ఉంటుంది? మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన విశాలాక్షీ అరిగెల ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. కొన్ని రకాల మైక్రోబులు ఎలా ఉంటాయో.. ఎక్కడ ఉంటాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

మనకే భూతద్దపు చూపు ఉంటే?
మనకే భూతద్దపు చూపు ఉంటే?
  1. మంచి నీటి చెరువులను, సరస్సులను ఎప్పుడైనా చూశారా? వాటి ఉపరితలం మీద ఆకుపచ్చటి ఒకలాంటి తెట్టెలు మెల్లిగా కదులుతూ ఉంటాయి. అవేమిటో తెలుసా? ఆకుపచ్చగా ఉంది కాబట్టి ఒక రకమైన మొక్క అనుకుంటారు. కానీ కాదు. ఒక రకం ప్రాణుల సమూహాం నీటి మీద అలా విహరిస్తూ ఉంటుంది. నీటి మీద పెరిగే ఈ నాచును ఆల్గే అని పిలుస్తారు.
  2. కాచిన పాలలో నిన్నటి పెరుగు కొద్దిగా కలిపితే ఏం జరుగుతుందో మనకు తెలుసు, కొద్ది గంటలకే అవి పేరుకుని చిక్కటి పెరుగుగా మారతాయి. ఇది తరతరాలుగా మానవుడికి తెలిసిన చిట్కానే. అయితే.. పాలు ఎందుకని ఇలా రూపాంతరం చెందుతాయి? మనం వేసిన ‘తోడు’లో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పాలను ఇలా పెరుగుగా మార్చేస్తుంది.
  3. బ్రెడ్డును కొన్ని రోజులు గాలి తగిలేలా వదిలేస్తే అది బూజు పడుతుంది. రొట్టె మీద నల్లగా పెరిగే మెత్తటి ఈ బూజే ఫంగస్ సూక్షప్రాణులు.
  4. ప్రపంచం అంతటా విస్తరించిన ప్రమాదకర వ్యాధుల్లో మలేరియా ఒకటి. దోమల ద్వారా వ్యాప్తి చెందే ప్రొటోజోవా తరగతి సూక్ష్మజీవుల వల్ల ఈ చలిజ్వరం వస్తుంది.
  5. మన ఇంట్లో ప్రతి నిత్యం బోలెడు చెత్త తయారు అవుతుంది. అలాగే ఇంటి ఆవరణలో చచ్చిపోయిన మొక్కలు ఉంటాయి. ఏ పిల్లినో, కుక్కో చనిపోతుంది. ఇవన్నీ కుళ్లి దుర్గంధం వ్యాపింపజేస్తాయి. వీటిని కుళ్లబెట్టేవి కూడా మైక్రోబులే. ఇలా కుళ్లిన చెత్తా చెదారం, జంతుకళేబరాలు చివరకు భూమిలో కలిసిపోతాయి. అలా నేల సారవంతం అవుతుంది.
  6. పల్లెటూళ్లలో పశువుల పేడను ట్యాంకులో నిల్వ ఉంచి, దాని ద్వారా వెలువడే గ్యాసును వంట చేసుకునేందుకు ఇంధనంగా వాడతారు. ఈ గోబర్ గ్యాసును తయారు చేసేవీ మైక్రోబులే.

సూక్ష్మ ప్రాణులు నిత్యజీవితంలో ఇలా పలు రకాలుగా మనతో సంబంధం కలిగి ఉంటాయి. వీటి ఉనికిని, ఇవి నిర్వహించే పాత్రను తెలుసుకోడం మనకు చాలా అవసరం. విజ్ఞాన శాస్త్రంలోని అన్ని విభాగాల్లోనూ వీటికి విశేష ప్రాముఖ్యం ఉంది. మైక్రో ఆర్గానిజంలు ఏదో విధంగా మనకు సాయపడుతున్నాయని, ఇవి మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం మరోటి ఉంది.. మైక్రోబులు మేలే కాదు మనకు కీడు కూడా చేస్తాయని విశాలాక్షి అంటున్నారు. జంతువులకు, మొక్కలకు, మనుషులకు ఇవి ప్రమాదకరమైన వ్యాధులు కలుగజేస్తాయి.ఎన్నో రకాల మహమ్మారులు, అంటువ్యాధులు సూక్ష్మప్రాణుల ద్వారానే ప్రబలుతాయి. మైక్రో ఆర్గానిజాలు కలిగించే ప్రాణాంతక వ్యాధులకు వాటితోనే టీకాలు, యాంటీ బయాటిక్ ఔషధాలు తయారుచేయడం మరో విశేషం. విషానికి విషమే విరుగుడు అంటే ఇదే మరి.

మనకే భూతద్దపు చూపు ఉంటే?

మన కళ్లకే గనుక భూతద్దపు చూపు ఉంటే.. మన చుట్టూ తిరుగుతూ ఉండే మైక్రోబుల విన్యాసాలను, అవి చేసే వింతలు విడ్డూరాలను, సృష్టించే పలు పదార్థాలను, అవి నివసించే ఇళ్లను ఎంచక్కా చూసేయవచ్చు. లక్షల కొద్దీ విచిత్ర ప్రాణులు మీ పక్కనే రయ్ రయ్ మంటూ తిరుగుతూ ఉంటే మీకెలా అనిపిస్తుంది? ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి.. మీకది ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటుందా?.. బాబోయ్ అంటూ జడుసుకుంటారా?

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details