ఫేస్బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా.. తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించడంలో ముందుంటుంది. దీనిలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టెలిగ్రామ్ తరహాలో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 'ఛానల్స్'ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్‌తో ఛానల్ క్రియేటర్స్ ఫొటోలు, వీడియోలు, కంటెంట్‌ను సభ్యులతో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని మెటా సంస్థ వెల్లడించింది.
ETV Bharat / science-and-technology
ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవాలా.. అయితే ఈ సరికొత్త ఫీచర్ మీకోసమే! - టెలిగ్రామ్ ఛానల్
సోషల్‌మీడియా యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందించడంలో ముందుండే సంస్థ మెటా. అదేనండీ.. ఫేస్బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ. ప్రస్తుతం ఈ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. టెలిగ్రామ్‌లో మాదిరిగా ఇన్‌స్టాలో కూడా 'ఛానల్' ఆప్షన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులో వస్తే యూజర్స్ తమ ఫాలోవర్స్‌ను మరింత పెంచుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అయితే ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా మరి!
ఎలా పనిచేస్తుందంటే..?
గత కొన్ని సంవత్సరాల నుంచి టెలిగ్రామ్‌లో 'ఛానల్' సదుపాయం ఉంది. టెలిగ్రామ్‌లో ఎలా పనిచేస్తుందో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా దాదాపు అలానే ఉంటుందని మెటా సంస్థ వెల్లడించింది. టెలిగ్రామ్‌లో మనకు నచ్చిన ఛానల్ పేరును సెర్చ్ చేసి లేదా మనకు వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి అందులో చేరవచ్చు. అలా చేరిన తర్వాత అడ్మిన్లు పంపిన ఫొటోలు, ఆడియోలు, వీడియోలు, సందేశాలు మనకూ అందుతాయి. దానికి మనం రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అచ్చం అలాగే.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఛానల్ అడ్మిన్ నుంచి వచ్చిన లింక్ ద్వారా మనం అందులో సభ్యులుగా చేరవచ్చు. దీంతో ఆ ఛానల్లో వచ్చే అప్డేట్స్ తెలుస్తాయి. ఇందులో వచ్చిన సందేశాలను చదవడం, చూడటమే కాకుండా.. రిప్లై ఇచ్చే సదుపాయం కూడా ఉంది. ఇవే కాకుండా యూజర్‌కు నచ్చిన ఛానల్లో చేరి.. ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుందని మెటా సంస్థ తెలిపింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి ఈ సరికొత్త ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని మెటా తెలిపింది. దీంతో పాటుగా ఛానల్లో చేరిన సభ్యులకు పూర్తి సమాచారాన్ని అందించడానికి వీలవుతుందని కంపెనీ తెలిపింది. దీని ద్వారా తాజా అప్డేట్లను కూడా షేర్ చేసుకోవడానికి వీలవుతుందని మెటా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ మెటా సీఈఓ జుకర్‌బర్గ్ సహా కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను వేగంగా తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మెటా. ఈ ఫీచర్‌పై ఆసక్తి ఉన్న వారు కంపెనీ వెబ్సైట్లో ముందుగా సైన్ అప్ అవ్వాలని తెలిపింది.