అది స్కూల్ బస్సు కావొచ్చు.. కాలేజీ బస్సు అవ్వొచ్చు.. రావాల్సిన సమయానికి రాకపోతే అమ్మపడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. ఇంట్లోకి, వీధిలోకి ఎన్నిసార్లు తిరుగుతుందో!
ఏ గల్లీలోనో పనిపడింది. కొత్త అడ్రెస్.. అందరినీ అడుగుతూ అడుగుతూ వెళ్లేసరికి పుణ్యకాలం గడిచిపోతుందేమో అని దిగులు.
ఇలాంటి టెన్షన్లకి చెక్ పెట్టేస్తూ రియల్‌టైమ్ జీపీఎస్ ట్రాకర్లనీ, డిజిటల్ మ్యాప్స్‌ని అందిస్తూ ఫోర్డ్, బీఎమ్‌డబ్ల్యూ లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలతో శెభాష్ అనిపించుకుంటున్నారు ‘మ్యాప్‌మై ఇండియా’ సంస్థ సారథి రష్మివర్మ..
పదిహేనేళ్ల క్రితం మాట. అప్పటికింకా గూగుల్ మ్యాప్‌లు పరిచయం కూడా లేనిరోజులు. రష్మి మాత్రం భవిష్యత్తులో డిజిటల్ మ్యాప్‌ల అవసరాన్ని ముందుగానే పసిగట్టారు. ప్రయాణాన్ని సులభతరం చేసి, సమయాన్ని ఆదాచేసే డిజిటల్ మ్యాపుల అవసరం రవాణా, ఆటోమొబైల్ రంగాల్ల్లో ఎక్కువగా ఉంటుందని గ్రహించారు. ఆయా రంగాలకు డిజిటల్ మ్యాప్‌లను అందివ్వడం కోసం పోర్టబుల్ జీపీఎస్ ట్రాకర్ పరికరాల తయారీని మొదలుపెట్టారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఈ జీపీఎస్ యంత్రాలు పనిచేసేలా రూపొందించారు. అంతముందుచూపుతో వ్యవహరించారు కాబట్టే అంతర్జాతీయ సంస్థలతో పోటీపడుతూ నేడు తన సంస్థని నెం.1 స్థానంలో నిలబెట్టగలిగారు.
మ్యాపింగ్‌పై గురి..
చదువుకునేందుకు ఆడపిల్లలకు ఏ మాత్రం ప్రోత్సాహకరమైన వాతావరణంలేని 70వ దశకంలోనే యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు రష్మి. తండ్రి రైల్వేలో డాక్టరు. తల్లి గృహిణి. ఇంజినీరింగ్ మూడో ఏడాదిలో ఉన్నప్పుడే ఆమెకు పెళ్లయ్యింది. కొన్నాళ్లకే భర్త రాకేశ్ వర్మతో కలిసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారామె. అక్కడే ఈస్ట్రన్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆపరేషనల్ రిసెర్చ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. డేటా సైన్స్, బిగ్ డేటా వంటి అంశాలపై రష్మి పట్టు తెచ్చుకున్నది కూడా అక్కడే. మాస్టర్స్ పూర్తయ్యాక సిటీ కార్ప్ అనే సంస్థలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ది వాల్‌స్ట్రీట్ బ్యాంక్‌కి ఐటీ సేవల్ని అందించే బాధ్యతల్ని నిర్వర్తించేవారు. ఆ తరువాత ఐబీఎమ్‌లో చేరి ఉన్నతస్థానాల్ని అందుకున్నారు. అక్కడ ఉన్నప్పుడే ప్రపంచం డిజిటల్ టెక్నాలజీ వైపు మళ్లడాన్ని గమనించారామె.
ఆ సాంకేతికత భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడాలని భావించిన రష్మి కుటుంబంతో కలిసి ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇక్కడ కంప్యూటర్ ఐస్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థను ప్రారంభించారు. టాటాస్టీల్, ఐబీఎమ్ వంటి సంస్థలకు ఆ సంస్థ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేవల్ని అందించేవారు. కానీ, అది మాత్రమే సరిపోదు ఇంకా ఏదో చేయాలని తరచూ తపన పడేవారు రష్మి. ఆ సమయంలోనే అమెరికాలో జరిగిన ఓ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ప్రదర్శనలో మొదటిసారి మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ని గమనించారు. తన భవిష్యత్తు ఆ రంగంలో ఉంటుందని బలంగా విశ్వసించారు.
కోకా-కోలాతో మొదలు..
దిల్లీ కేంద్రంగా భర్తతో కలిసి మ్యాప్‌మైఇండియా పేరుతో మ్యాపింగ్ సొల్యూషన్స్ సంస్థని ఏర్పాటు చేశారు రష్మి. ‘కోకా-కోలా, జిరాక్స్, మోటరోలా...వంటి అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో వ్యాపార విస్తరణని వేగవంతం చేస్తున్న రోజులవి. తమ ఉత్పత్తులని చిన్నచిన్న పల్లెలకు కూడా చేరవేయాలని ఉత్సాహంగా ఉన్న ఆ సంస్థలకి మా సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా కోకా-కోలాకి. థమ్సప్‌ని కొనుగోలు చేసి ఇంకా ముందుకువెళ్లే ప్రయత్నాల్లో ఉందా సంస్థ. అప్పటికే థమ్సప్‌కి నెట్‌వర్క్ ఉన్నా డిస్ట్రిబ్యూషన్ ప్రదేశాలు వేర్వేరు చోట్ల ఉండటంతో కోలాకి ఇదో పెద్ద సవాల్‌గా మారింది. మేం ఆ సమస్యకు పరిష్కారంగా... వాళ్ల అవుట్‌లెట్స్‌తో సహా డిజిటల్ పటాలను తయారు చేసి అందించగలిగాం. అక్కడ నుంచి డిజిటల్ మ్యాప్, డేటా, జీపీఎస్ నావిగేషన్, లొకేషన్ బేస్డ్ సర్వీస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇలా ఒక్కోసర్వీసుని పెంచుకుంటూ వెళ్లాం’ అంటారు రష్మి.
పదేళ్లపాటూ జీతం లేకుండా..
‘సంస్థ ప్రారంభించినప్పటి నుంచి పెట్టుబడి పెట్టడమే కానీ పదేళ్ల పాటు నేనూ, మావారు జీతాలు తీసుకోకుండా పనిచేశాం. ఆ తరువాత నెమ్మదిగా లాభాల బాట పట్టాం’ అనే రష్మి మ్యాప్‌ల తయారీ వెనుక కష్టాన్ని వివరించారు. ‘మా ఉద్యోగులు వీధివీధీ తిరిగి సర్వేలు చేసి.. ఆయా ప్రాంతాలు, వీధుల పేర్లు నమోదు చేసుకునేవారు. ఇలా సుమారు రెండు కోట్ల డేటా పాయింట్లను తయారుచేయగలిగాం. క్రమంగా త్రీడీ విజువలైజేషన్స్‌ని జోడించి ఇప్పుడు మీరు చూస్తున్న ఆధునిక నావిగేషన్ సిస్టమ్‌ని రూపొందించాం. ఇదంతా చేయడానికి చాలా కష్టపడ్డాం. కానీ మా కష్టం వృథాపోలేదు.
మేం తయారుచేసిన ఇన్‌బిల్ట్ డిజిటల్ మ్యాప్ సొల్యూషన్స్‌ని, టచ్‌స్క్రీన్ యంత్రాలకు... ఆటోమొబైల్ రంగంలో దిగ్గజాలైన టాటామోటార్స్, హుండాయ్, బీఎండబ్ల్యూ, ఫోర్డ్, జాగ్వార్, టీవీఎస్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు వినియోగదారులుగా మారాక చాలా సంతోషించాం. ఇవి మాత్రమే కాదు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఓలా వంటి సంస్థలూ మా మ్యాప్‌లని ఉపయోగించుకుంటున్నాయి. స్కూల్ బస్సుల్లో సైతం మా జీపీఎస్ ట్రాకర్లని అమరుస్తున్నాం. వీటి సాయంతో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు టెన్షన్ పడకుండా స్కూల్ బస్సు ఎక్కడున్నదీ తెలుసుకోవడం తేలికవుతుంది’ అంటారు రష్మి. తాజాగా మ్యాప్‌మై ఇండియా ‘మూవ్’ పేరుతో ఒక జీపీఎస్ ట్రాకర్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్స్‌లో ఉత్తమ యాప్‌గా అవార్డు అందుకోవడం విశేషం.