తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మంగళయాన్​ సమాప్తం! ఇంధనం ట్యాంక్, బ్యాటరీ ఖాళీ!! - మంగళయాన్ మిషన్ ముగింపు తేదీ

"ప్రస్తుతం మంగళయాన్ వ్యోమనౌకలో ఇంధనం లేదు. బ్యాటరీ కూడా డ్రెయిన్‌ అయింది. మంగళయాన్‌తో సంబంధాలు తెగిపోయాయి" అని ఇస్రో వర్గాలు తెలిపాయి. అధికారికంగా ఆ సంస్థ నుంచి ప్రకటన వెలువడలేదు.

mangalyaan end date
మంగళయాన్​కు ఇక సెలవు! ఇంధనం ట్యాంక్, బ్యాటరీ ఖాళీ!!

By

Published : Oct 3, 2022, 6:47 AM IST

అంచనాలను మించి పనిచేసిన భారత తొలి అంగారక ఉపగ్రహం మంగళయాన్‌ ప్రస్థానం ముగిసిపోయినట్లు తెలుస్తోంది. ఆ వ్యోమనౌకలో ఇంధనం, బ్యాటరీ స్థాయి.. సురక్షిత పరిమితి కన్నా తక్కువకు పడిపోవడంతో దీని సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ.450 కోట్లతో చేపట్టిన మంగళయాన్‌ను 2013 నవంబరు 5న పీఎస్‌ఎల్‌వీ-సి25 రాకెట్‌ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. 2014 సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. తద్వారా తొలి ప్రయత్నంలోనే ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. నాటి నుంచి ఆ వ్యోమనౌక అప్రతిహతంగా సేవలు అందిస్తూనే ఉంది.

నిజానికి ఆరు నెలలు పాటు మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే అంచనాలను మించి దాదాపు 8 ఏళ్లపాటు సేవలు అందించింది. అంగారకుడికి సంబంధించిన 8వేలకుపైగా ఫొటోలను పంపింది. ఆ గ్రహ అట్లాస్‌ను అందించింది. సూర్యకాంతి లభించని 'గ్రహణం దశ'ను తప్పించుకోవడానికి ఈ వ్యోమనౌక కక్ష్యను పలుమార్లు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా అందులోని ఇంధనం ఖర్చయింది. ఇటీవల వరుసగా ఇలాంటి గ్రహణ పరిస్థితులు ఎదురయ్యాయని ఇస్రో వర్గాలు తెలిపాయి. అందులో ఒకదాని నిడివి ఏడున్నర గంటలు ఉందని పేర్కొంది.

గంటన్నర గ్రహణాన్ని మాత్రమే తట్టుకునేలా ఈ ఉపగ్రహ బ్యాటరీని రూపొందించారు. అంతకన్నా ఎక్కువసేపు సూర్యకాంతి లభించకుంటే బ్యాటరీలో ఛార్జింగ్‌ సురక్షిత పరిమితి కన్నా తక్కువ స్థాయికి పడిపోతుంది. "ప్రస్తుతం ఈ వ్యోమనౌకలో ఇంధనం లేదు. బ్యాటరీ కూడా డ్రెయిన్‌ అయింది. మంగళయాన్‌తో సంబంధాలు తెగిపోయాయి" అని ఇస్రో వర్గాలు తెలిపాయి. అధికారికంగా ఆ సంస్థ నుంచి దీనిపై ప్రకటన వెలువడలేదు.

ABOUT THE AUTHOR

...view details