మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. ఒక్క రక్తం చుక్క చిందకుండా అహింసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని... గడగడలాడించిన మహోన్నత శక్తి. భరతమాత బానిస సంకెళ్లు తెంచి కోట్లమందికి.. స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారాలు బహుమతిగా అందించిన శాంతమూర్తి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో.. గాంధీ వచ్చే వరకూ సాగిన ఘట్టం ఒక ఎత్తైతే.. ఆయన వచ్చిన తర్వాత సాగిన సంగ్రామం మరోఎత్తు. నెత్తుటి ధారలతో బ్రిటిష్ సైన్యం మారణహోమం సృష్టిస్తున్నప్పటికీ.. శాంతిమంత్రం నుంచి పక్కకు జరగని సహనశీలి గాంధీ. శారీరక సామర్థ్యం నుంచి కాదు, తిరుగులేని మనో సంకల్పంనుంచే శక్తి ఉద్భవిస్తుందని త్రికరణ శుద్ధిగా విశ్వసించి, సత్యం అహింసలనే శ్వాసించిన వ్యక్తి గాంధీజీ. కోట్లాదిమంది సామాన్యులతో.. స్వాతంత్ర్య సమరనాదం చేయించిన ఘనత బాపూది. మహాత్ముడు తనదైన శైలిలో.. ప్రజల్ని ఒక్కటి చేశారు. వరుస ఉద్యమాలతో స్ఫూర్తి నింపారు. సత్యాగ్రహాలతో స్వాతంత్ర్యం సిద్ధిస్తుందా అనే అనుమానాలు పటాపంటలుచేసి ఆంగ్లేయుల నుంచి భరతమాతకు విముక్తి కల్పించిన ధీశాలి బాపూ. బ్రిటిష్ పాలకులు అర్ధ నగ్న ఫకీరుంటూ ఎద్దేవాచేసినా....తన ఆహార్యంలో కించిత్తు మార్పు చేయని నిరాడంబర శీలి మన గాంధీజీ.
బాపూజీ.. ఓ మహర్షి..
- గాంధీ రక్త మాంసాలతో ఈనేల మీద నడయాడిన వ్యక్తి అంటే.. భావితరాలవారు ఏమాత్రం నమ్మలేరని.. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పారంటే మహాత్ముడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.
- తనలానే ఇతరులూ ఉండాలని కోరుకుని.. అందుకోసమే ఆఖరి శ్వాస వరకూ తపించిన మహర్షి బాపూజీ. ద్వేషించిన వారిని కూడా.. అమితంగా ప్రేమించటం, ఆ ప్రేమతోనే వారిని మార్చాలని ప్రయత్నించటం ఈ కాలంలో సాధ్యమా? కానీ వాటిని ఆచరించి చూపారు బాపూ. సమకాలీన పరిస్థితుల్లో.. గాంధేయవాదమే దివ్యమంత్రం.
- 10మందికి సంపదనిచ్చి, వేలమందిని ఉపాధినివ్వని పారిశ్రామికీకరణ ఎందుకు సరైనది కాదో గాంధీ ఆనాడే వివరించారు. చరఖా ద్వారా.. తాను ప్రపంచానికి ఏం సందేశమివ్వాలనుకున్నారో కుండబద్దలు కొట్టారు. ఈ ప్రపంచానికి నేను కొత్తగా చెప్పిన పాఠాలేవీ లేవు. సత్యాగ్రహం, అహింసా చాలాపురాతనమైనవని ప్రకటించడం.. ఆయనలోని నిరాడంబరత, నిజాయితీనీ నేటికీ చాటుతూనే ఉన్నాయి.
బాధలు, అవమానాలను ఎదుర్కొని..
సత్యాగ్రహం, అహింస సిద్ధాంతాలను.. మొదట గాంధీజీ వ్యక్తిగతంగా పరీక్షించుకున్నాకే ఆచరణలో పెట్టారు. అజ్ఞానాన్ని పోగొట్టే విజ్ఞానశాస్త్రమే.. గాంధీజీ నమ్మిన మతం. విజ్ఞాన శాస్త్రం, మతం, తత్వశాస్త్రాల నిత్య పరిశోధనే గాంధీజీ ఆధ్యాత్మికత. అంతా ఒక్కటే అనే సర్వ మానవ సమభావనను నిత్యం బోధించిన బాపూజీ.. జీవించి ఉన్నన్నాళ్లూ ఆధునిక దృక్పథాన్ని కనబరిచేవారు. కాలానికి తగినట్లు గాంధీజీ జీవించలేరన్న విమర్శలకు బాపూ ఓపికగానే... సమాధానమిచ్చారు. నడుముకు వస్త్రం ధరించి, తాను ఎక్కడికి వెళ్ళినా, చరఖా వెంటతీసుకుని వెళ్లేవారు. బాధలు, అవమానాలు, కోపాలు.. మౌనంగా భరించే గాంధీజీ సహనం అనంతమైనది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. గాంధీజీ ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటూ, నవ్వించేవారు.
అహింసా, సత్యాగ్రహంతోనే...
మానవత్వమే మతంగా నమ్మిన మహాత్ముడు.. ఓ ప్రాంతం, కొందరి ప్రయోజనాల కోసం ఏనాడూ వకాల్తా పుచ్చుకోలేదు. మనసా వాచా కర్మేణా ఎప్పుడూ నమ్మిన సిద్ధాంతాల కోసం తపించారు. సమజంలో అన్యాయాలపై పోరాడటానికి గాంధీజీ ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన ఆయుధాలు అహింసా, సత్యాగ్రాహమే. ఆధునికత పేరుతో పర్యావరణ విధ్వంసంపై మహాత్ముడు ఎప్పుడూ నిరసన గళం వినిపించేవారు. ఎన్నోసార్లు ఆధునిక పద్ధతుల కన్నా సంప్రదాయ విధానాలే మేలని స్పష్టం చేసేవారు. అందుకే చాలామంది గాంధీని సంప్రదాయవాదిగా పరిగణించారు. హిందువుగా పుట్టిహిందువుగానే మరణించినా.. ఆయన కేవలం ఒక మత సిద్ధాంతాలకే కట్టుబడలేదు. అన్నిమత గ్రంథాలూ చదివి అర్థం చేసుకున్నారు. అంటరాని తనంపై అప్పట్లోనే ఆవేదన వ్యక్తం చేసేవారు.
తరతరాలు బాపూ స్మరణలోనే..