తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మొబైల్​ ఫోన్​ పోయిందా? ఆన్​లైన్​లో సింపుల్​ రిక్వెస్ట్​తో బ్లాక్! సిమ్ మార్చినా నో ఛాన్స్!!

చోరీకి గురైన ఫోన్లను సులభంగా బ్లాక్ చేసేందుకు వీలుగా టెలికాం శాఖ కొత్త వెబ్​సైట్ అందుబాటులోకి తెచ్చింది. చోరీకి గురైన ఫోన్​ను బ్లాక్ చేస్తే.. అందులో ఇతర సిమ్​లు వేసినా పనిచేయకుండా చేసే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.

lost-mobile-block-imei
lost-mobile-block-imei

By

Published : Mar 20, 2023, 3:53 PM IST

మార్కెట్​లో నకిలీ మొబైల్ ఫోన్లకు అడ్డుకట్ట వేయడం సహా పోగొట్టుకున్న ఫోన్లను వెంటనే బ్లాక్ చేసేందుకు వీలుగా టెలికాం శాఖ కీలక ముందడుగు వేసింది. దేశంలోని అన్ని మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు ఉండే డేటాబేస్​ను అందుబాటులోకి తెచ్చింది. సెంట్రల్ ఎక్విప్​మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) పేరుతో సేవలు ప్రారంభించింది. దేశంలోని మొబైల్ ఆపరేటర్ల డేటాబేస్​లను ఇది కనెక్ట్ చేస్తుంది. నకిలీ ఫోన్లను గుర్తించడం, మొబైల్ చోరీలను నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం.

మొబైల్ నెట్​వర్క్ ఆపరేటర్లందరినీ ఒకే గొడుగు కిందకు తెస్తుంది సీఈఐఆర్. ఐఎంఈఐ నంబర్​తో మొబైల్​ను పనిచేయకుండా బ్లాక్ చేసే అవకాశం ఇది కల్పిస్తుంది. అంతేకాకుండా.. బ్లాక్​లిస్ట్​ చేసిన సిమ్​లు ఏ ఫోన్​లలో ఉన్నాయనే వివరాలను ఇది సేకరిస్తుంది. ఆ ఫోన్​లో ఇతర సిమ్​లు వేసినా పనిచేయనీయకుండా చేస్తుంది. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా యూజర్లు తమ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు. ఫోన్లు చోరీకి గురైతే.. ముందు జాగ్రత్తగా ఇలా బ్లాక్ చేసి మొబైల్ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.

పోగొట్టుకున్న/ చోరీకి గురైన ఫోన్​ను ఎలా బ్లాక్ చేయాలి?
సీఈఐఆర్ వెబ్​సైట్​ ( http://ceir.gov.in/ )లో ఓ రిక్వెస్ట్ ఫైల్ చేసి తమ ఫోన్ IMEI నెంబర్​ను బ్లాక్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్​ను దుర్వినియోగం చేయకుండా ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరుపడితే వారు కాకుండా.. నిజంగా తమ ఫోన్​ను పోగొట్టుకున్నవారే ఇందులో రిక్వెస్ట్ ఫైల్ చేసే వీలు ఉంటుంది. వెబ్​సైట్​ ద్వారా IMEI నంబర్​ను బ్లాక్ చేయాలని అనుకునేవారు.. డివైజ్ వివరాలతో పాటు మొబైల్ కొనుగోలుకు సంబంధించిన బిల్లు, పోలీస్ కంప్లైంట్ లెటర్, ఐడీ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.

వీటన్నింటినీ సమర్పించిన తర్వాత 24 గంటల్లో పోగొట్టుకున్న/ చోరీకి గురైన ఫోన్ బ్లాక్ అవుతుంది. ఇక ఆ ఫోన్​లో ఏ సిమ్ కార్డ్ వేసినా పనిచేయదు. ఇక ఆ ఫోన్​ను దాని యజమాని మాత్రమే అన్​బ్లాక్ చేయగలుగుతారు. మొబైల్ తిరిగి దొరికితే.. అదే పోర్టల్​లో అన్​బ్లాక్ రిక్వెస్ట్ పెట్టి.. దాన్ని తిరిగి యూజ్ చేసుకోవచ్చు.

ఈ సేవలను ఇదివరకే పలు ప్రాంతాల్లో ప్రారంభించింది టెలికాం శాఖ. 2019 సెప్టెంబర్ 13న మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీలో సీఈఐఆర్​ను అందుబాటులోకి తెచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 30న దిల్లీలో దీన్ని ఆవిష్కరించారు. తాజాగా ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. పోగొట్టుకున్న/ చోరీకి గురైన ఫోన్లను బ్లాక్ చేయడం, దొరికిన మొబైళ్లను అన్​బ్లాక్ చేయడం వంటి సేవలతో పాటు.. రిక్వెస్ట్ స్టేటస్​లు, ఐఎంఈఐ వెరిఫికేషన్, నో యువర్ మొబైల్ (నీ మొబైల్ గురించి తెలుసుకో) వంటి సేవలను సైతం ఈ వెబ్​సైట్ అందిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details