కరోనా విజృంభిస్తున్నా, ఇంటిపట్టునే ఉండలేని పరిస్థితి. బతుకుపోరులో బయటికి వెళ్లాల్సిందే. ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖానికి మాస్కు, చేతిలో శానిటైజర్లే ఆయుధాలు. అయినా పూర్తిస్థాయిలో రక్షణ పొందుతున్నామా అన్నది ప్రశ్నార్థకమే. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ప్రభావవంతంగా పనిచేసే శానిటైజర్లను ఐఐటీ హైదరాబాద్ యువ పరిశోధకులు ఆవిష్కరించారు. ఆవిష్కరణతో సరిపెట్టకుండా. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
అందుబాటు ధరల్లో..
మార్కెట్లలో చౌక హ్యాండ్ శానిటైజర్ల వల్ల ప్రయోజనం ఏమేరకు ఉంటుందో తెలియదు. అందుకే.. అందుబాటు ధరల్లో, ఎక్కువ సమయం సమర్థంగా వైరస్‌ను చంపగలిగే శానిటైజర్‌ను తయారుచేయాలని ఐఐటీ హైదరాబాద్ నిశ్చయించుకుంది. బయోమెడికల్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించే జ్యోత్సినేడు గిరి బృందం శానిటైజర్ తయారీ కోసం పరిశోధన చేసింది. రోజుకు వంద లీటర్లకు పైగా శానిటైజర్ ఉత్పత్తి చేసి, ఉచితంగానే ప్రజలకు పంపిణీ చేయడం ప్రారంభించింది.
డబ్ల్యూహెచ్‌వో ఫార్ములాతో..
గతేడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పుడు, మా డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తికి ఓ ఆలోచన తట్టిందని విద్యార్థులు తెలిపారు. హ్యాండ్ శానిటైజర్లు స్థానికులకు, కొవిడ్ ఆసుపత్రులకు ఉచితంగా పంపిణీ చేయాలని అనుకున్నామని వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన శానిటైజర్ ఫార్ములాను వినియోగించి, శానిటైజర్ తయారు చేయాలనుకున్నామని... దాన్ని వివిధ ఆసుపత్రులు సహా సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పంపిణీ చేయాలనుకున్నామని పేర్కొన్నారు.
నానో టెక్నాలజీ ఆధారంతో..
సాధారణ శానిటైజర్ ప్రభావం తాత్కాలికమే కావడంతో.. పనితీరు మెరుగుపరిచేందుకు జ్యోత్స్నెందు గిరి ఆధ్వర్యంలోని పరిశోధక బృందం విస్తృత స్థాయిలో పరిశోధన సాగించింది. నానో టెక్నాలజీ ఆధారంగా ప్రభావవంతంగా పనిచేసే శానిటైజర్ తయారీపై దృష్టి పెట్టారు. ఏడాది పాటు 700 నమూనాలు తయారుచేసిన తర్వాత డ్యూరోకియా పేరుతో 4ఉత్పత్తులను అవిష్కరించారు.