తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఒకే స్క్రీన్​పై ప్రయాణికుడ్ని బట్టి ఫ్లైట్ వివరాలు.. ఎయిర్​పోర్ట్ కష్టాలకు ఇక చెక్! - ప్యార్లల్ రియాల్టీ డెట్రాయిట్ విమానాశ్రయం

ట్రాఫిక్‌ పద్మవ్యూహాలను ఛేదించుకొని.. ఆపసోపాలు పడి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని.. భద్రతాపరమైన లాంఛనాలు పూర్తి చేసుకొని.. లోపలికి వెళ్లేసరికి ఒక్కోసారి చాలా సమయం గడిచిపోవచ్చు. ఆ హడావుడిలో మన ఫ్లైట్‌ ఎక్కడుందో.. అక్కడికి చేరుకోవడానికి ఏ గేట్‌ గుండా వెళ్లాలో తెలియక తికమక పడుతుంటాం. అక్కడి భారీ తెరలపై డజన్ల సంఖ్యలో ఫ్లైట్‌ సర్వీసుల రాకపోకల వివరాలు ఉంటాయి. అందులో నిర్దిష్టంగా మన విమానం వివరాలను వెతికిపట్టుకోవడం కష్టమవుతుంటుంది. ఇలాంటి సమస్యలను దూరం చేసే సరికొత్త పరిజ్ఞానం వచ్చేసింది. ఎన్ని ఫ్లైట్‌ సర్వీసులున్నా.. వీక్షకులు ఎంత మంది ఉన్నా.. ఎవరికి కావాల్సిన వివరాలను వారికి విడివిడిగా ఏకకాలంలో ప్రదర్శించే అద్భుత తెర సిద్ధమైంది.

parallel reality technology
ఒకే స్క్రీన్​పై ప్రయాణికుడ్ని బట్టి ఫ్లైట్ వివరాలు.. ఎయిర్​పోర్ట్ కష్టాలకు ఇక చెక్!

By

Published : Oct 10, 2022, 7:32 AM IST

ఇదంతా హాలీవుడ్‌ సైన్స్‌ కాల్పనిక సినిమాలా అనిపిస్తోంది కదా?. కానీ నిజం!
Parallel reality technology : ఈ మాయాతెరను అమెరికాలోని డెట్రాయిట్‌ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 'ప్యార్లల్‌ రియాల్టీ' సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీని కాలిఫోర్నియాలోని మిస్‌అప్లైడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసింది.

'రెక్కలు'కట్టుకొని వాలే సమాచారం

  • Parallel reality airport : భద్రతా తనిఖీలయ్యాక ప్రయాణికుడు మొదట ఒక కియోస్క్‌ వద్దకు వెళ్లి తన బోర్డింగ్‌ పాస్‌ లేదా డెల్టా సంస్థకు సంబంధించిన డిజిటల్‌ ఐడీ ఫేషియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థ ద్వారా ముఖాన్ని స్కాన్‌ చేసుకోవాలి.
  • అప్పుడు ప్రయాణికుడి గుర్తింపు, అతడున్న ప్రదేశానికి మధ్య ఒక బంధాన్ని ఈ సాంకేతికత ఏర్పరుస్తుంది.
  • అక్కడే ఉన్న ఒక మోషన్‌ కెమెరా.. ప్రయాణికుడి ఆకృతిని పరిశీలిస్తూ తదుపరి చర్యలు చేపడుతుంది. అతడు ఎక్కాల్సిన విమానం వివరాలను ప్రదర్శించాలని 'ప్యార్లల్‌ రియాల్టీ తెర'కు సూచిస్తుంది.
  • ప్రయాణికుడున్న ప్రదేశాన్ని బట్టి తెరలో ఏ వైపున సమాచారాన్ని ప్రదర్శించాలన్నది కూడా ఆ కెమెరా నిర్దేశిస్తుంది. అతడి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. సులువుగా వీక్షించగలిగేలా సందేశాన్ని ప్రదర్శింపచేస్తుంది.
  • ఇలా ఏకకాలంలో వంద మంది ఒకే తెరపై తమకు కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు. ఇతరుల వివరాలు అందులో కనిపించవు.
  • ఈ తెరను చూడటానికి మనకు కెమెరా లేదా హెడ్‌సెట్‌ వంటి సాధనాల అవసరం ఉండదు. కంటితోనే వీక్షించొచ్చు.

ఏ వివరాలు అందిస్తుంది?

  • గేట్‌ నంబర్‌
  • అది ఏ దిశలో ఉంది
  • అక్కడికి చేరుకోవడానికి ఎంతసేపు పడుతుంది
  • విమానం బయల్దేరే సమయం

భిన్న సాంకేతికతల కలయిక..
ప్యార్లల్‌ రియాల్టీ సాంకేతికత కోసం అధునాతన సెన్సర్లు, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ సాధనాలు, మెషీన్‌ విజన్‌, డేటా మేనేజ్‌మెంట్‌, ప్రిడిక్టివ్‌ ఎనలిటిక్స్‌, పెద్ద సంఖ్యలో కాంతి కిరణాలను మెరుగ్గా సమన్వయపరిచే పిక్సెల్‌ ప్రాసెసర్‌ నెట్‌వర్క్‌, ప్రతి కిరణం గమ్యస్థానాన్ని లెక్కించే ప్రిసిషన్‌ స్పేషియల్‌ క్యాలిబరేషన్‌ వంటి సాంకేతికతలను పరిశోధకులు ఉపయోగించారు.

మరిన్ని ఉపయోగాలు..
ప్రస్తుత డిస్ప్లేలు, సైన్‌ బోర్డులు, సిగ్నళ్లు, లైట్‌ల స్థానంలో భవిష్యత్‌లో మరింత సమర్థ వ్యవస్థలను తీసుకురావడానికి ప్యార్లల్‌ రియాల్టీ వీలు కల్పిస్తుంది.

  • ఆతిథ్యరంగం:తెరలపై కంటెంట్‌ను ప్రతి వీక్షకుడి సొంత భాషలో ప్రదర్శించొచ్చు.
  • మార్గదర్శనం:వీక్షకుడి గమ్యస్థానానికి అనుగుణంగా అతడికే ప్రత్యేకమైన సూచనలను ఇవ్వొచ్చు.
  • స్పష్టత:వీక్షకుడు ఎంత దూరంలో ఉన్నాడు..ఏ కోణంలో చూస్తున్నాడు.. వంటి అంశాల ఆధారంగా కంటెంట్‌ పరిమాణాన్ని సర్దుబాటు చేయవచ్చు.
  • మార్కెటింగ్‌ :వీక్షకుడి అవసరాలు ఆసక్తులు, వ్యవహారశైలికి అనుగుణంగా వాణిజ్య ప్రకటనలను ప్రదర్శించొచ్చు.
  • వినోదం:వినోద ప్రాంగణాల్లో వీడియోలు, సందేశాలు, లైటింగ్‌ ఎఫెక్ట్‌లను ప్రతి వీక్షకుడి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు.
  • ట్రాఫిక్‌ గుర్తులు, సిగ్నళ్లు:రోడ్లపై ప్రతి జోన్‌, లేన్‌, వాహనానికి ప్రత్యేకమైన సందేశాలు, సిగ్నళ్లను ప్రదర్శించొచ్చు.
  • రద్దీ నియంత్రణ :బహిరంగ ప్రదేశాల్లో ప్రతి వీక్షకుడికి నిర్దిష్ట నిష్క్రమణ మార్గాన్ని తెరలపై చూపొచ్చు.

ఎలా సాధ్యం?
How does parallel reality work :

* సాధారణ టీవీ లేదా వీడియో తెరలో ఒక పిక్సెల్‌.. ఏ సమయంలోనైనా ఒకే రంగుకు సంబంధించిన కాంతినే అన్ని దిశల్లోకి వెదజల్లుతుంది.

* ప్యార్లల్‌ రియాల్టీ తెరలో కొత్త రకం పిక్సెల్స్‌ ఉంటాయి. ఒక్కో పిక్సెల్‌.. ఏకకాలంలో భిన్న వర్ణఛాయలు, భిన్న వెలుగుల స్థాయి కలిగిన కిరణాలను లక్షల సంఖ్యలో విడుదల చేస్తుంది. ప్రతి కిరణాన్నీ సాఫ్ట్‌వేర్‌ సాయంతో నియంత్రించొచ్చు. అది నిర్దిష్ట వ్యక్తికి మాత్రమే చేరేలా చేయవచ్చు.

* ఈ విధానంలో ఒక వ్యక్తి ఒక రకం కాంతిపుంజాన్ని మాత్రమే చూడగలుగుతాడు. అతడు చూసేది మరెవరికీ కనిపించదు. ఇతరులకు వారికి ఉద్దేశించిన కాంతిపుంజాలు మాత్రమే కనబడుతుంటాయి.

ABOUT THE AUTHOR

...view details