పుట్టుక నుంచి చావు వరకు జీవితంలో అన్ని దశలనూ.. కణాల నుంచి నక్షత్రాల వరకు సృష్టిలోని అన్ని అంశాలనూ స్పృశిస్తూ 2022 శాస్త్ర, సాంకేతిక రంగం అప్రతిహతంగా దూసుకుపోయింది. చనిపోయిన జంతువుల అవయవాలకు తిరిగి జీవం పోయటం.. శుక్ర కణం, అండం లేకుండానే పిండాన్ని సృష్టించటం.. విశ్వం తొలినాళ్లను కళ్లకు కట్టేలా చూపటం.. కళాఖండాలను చిత్రించే కృత్రిమ మేధ వంటి ఎన్నో అద్భుతాలను సుసాధ్యం చేసింది. వీటిల్లో కొన్ని అందరికీ, చవకగా అందుబాటులోకి రాకపోవచ్చు. కొన్ని సాకారం కావటానికి చాలా ఏళ్లు పట్టొచ్చు. కానీ శాస్త్ర, సాంకేతిక పురోగతికి కొత్త ఊతం ఇచ్చిన మాట నిజం. అభివృద్ధి పథంలో కొంగొత్త ఆశా కిరణాలుగా మెరుస్తున్న మాట నిజం.
కృత్రిమ మేధ విజృంభణ
అధునాతన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) టూల్స్ మానవ సృజనాత్మకతకు హద్దులు చెరిపేస్తున్నాయి. ఇమేజ్‌లను సృష్టించే స్టేబుల్ డిఫ్యూజన్, డాల్-ఇ 2 వంటి యాప్‌లు కళారంగంలో కొత్త అలజడిని సృష్టించాయి. టెక్స్ట్‌ను అద్భుతమైన చిత్రాలుగా మలుస్తూ కళాకారుల ఊహలకే సవాల్ విసురుతున్నాయి. ప్రపంచాన్ని మనం చూసినట్టుగా చూసేలా వీటికి నేర్పించటం వీటిల్లోని కీలకాంశం. మున్ముందు ఇవి చూసే తీరును మనం నేర్చుకోవాల్సి ఉంటుందనీ భావిస్తున్నారు.
క్రమంగా వీటితో మాట్లాడమెలాగో నేర్చుకొని.. వాటి భాషలో నైపుణ్యం సాధిస్తే కేవలం కొన్ని పదాలతోనే గొప్ప గొప్ప కళాఖండాలను సృష్టించటం సాధ్యమవుతుంది. మరోవైపు ఛాట్‌జీపీటీ వంటి పెద్ద భాషా నమూనాలు సంక్లిష్టమైన ప్రశ్నలకూ స్పందిస్తున్నాయి. వికీపీడియా వంటి విజ్ఞాన వెబ్‌సైట్లలోని కథనాలను సెకండ్లలోనే విశ్లేషించుకొని ప్రత్యుత్తరమిస్తున్నాయి. అసమంజసమైనవాటిని తిరస్కరిస్తూ హితవు చెబుతున్నాయి కూడా. అంతేనా? పాటలను రాస్తున్నాయి. కష్టమైన వైద్య కథనాలనూ ప్రసిద్ధ రచయితల శైలిలో ముందుంచుతున్నాయి.
ఇలాంటి కృత్రిమ మేధ పరికరాలు మనిషి ఊహాశక్తిని, రచనా నైపుణ్యాన్ని చంపేస్తాయా? అనే భయాందోళనలనూ రేపుతున్నాయి. నిజానికివన్నీ సృజనాత్మక రంగంలో మనకు తోడ్పడేవే. ఏదైనా కఠినమైన పదానికి నిఘంటువు అర్థాన్ని వెతికి పెట్టినట్టుగా అవసరమైన సమయాల్లో చేదోడు వాదోడుగా నిలిచేవే. పదాలు తట్టక సతమతమవుతున్నప్పుడో, రాసిన దాన్ని సవరించాలనుకున్నప్పుడో వీటి సాయం ఎంతగానో తోడ్పడుతుంది. మన మెదడులోంచి పుట్టుస్తున్న ఏఐ పరికరాలు భవిష్యత్‌లో మన పని విధానం, ఆలోచన తీరు, సృజనాత్మక శక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయనటం నిస్సందేహం.
మరణంపై విజయం!
మరణాన్ని జయించటంపై ఈ సంవత్సరం కొత్త ఆశలు కల్పించింది. చనిపోయిన పందులను తిరిగి బతికించటంలో యేల్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. గంట క్రితం చనిపోయిన పందుల రక్తనాళాల్లోకి ప్రయోగాత్మక మందును పంపించి, వాటి గుండెలను తిరిగి కొట్టుకునేలా చేశారు మరి. ఇప్పుడప్పుడే ఇది మనుషులకు అందుబాటులోకి రాకపోవచ్చు గానీ చనిపోయినవారి అవయవాలను సంరక్షించి, ఇతరులకు అమర్చటానికి తగినంత సమయం లభించేలా చూడొచ్చు. దీర్ఘకాలంలో దీని ప్రభావాలను కొట్టిపారేయలేం.
అప్పుడే చనిపోయినవారి గుండె, ఇతర అవయవాలను తిరిగి పనిచేయిస్తే? హఠాత్తుగా మరణించినవారిని వెంటనే బతికేలా చేస్తే? యుద్ధంలో మరణించిన సైనికులకు పునర్జన్మ ప్రసాదిస్తే? ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. ఈ ఒక్క మందుతో తిరిగి జీవించేలా చేయగలిగితే ఆత్మీయులను కోల్పోయినవారికి అంతకన్నా కావాల్సిందేముంది?*గుండె వైఫల్యం చివరిదశలో ఉన్న ఒకరికి జన్యుపరంగా మార్చిన పంది గుండెను అమర్చటంలోనూ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీన్ని అమర్చిన రెండు నెలల తర్వాత ఆ వ్యక్తి మరణించినప్పటికీ కొత్త ఆశలు రేకెత్తించింది. జన్యుపరంగా మార్చిన జంతు అవయవాలను మనుషులకు అమర్చటం సాధ్యమేనని ఇది రుజువు చేసింది. కొన్ని అడ్డంకులను తొలగించుకోగలిగితే అవయవాల మార్పిడి ఎదురు చూపులకు తెర పడ్డట్టే.
కృత్రిమ ప్రాణం!
పిండం ఏర్పడాలంటే శుక్ర కణం, అండం కలవాల్సిందే. ఇవేవీ లేకుండానే పిండాన్ని సృష్టిస్తే? ఇజ్రాయెల్‌లోని వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు అలాంటి విజయాన్నే సాధించారు. అండం, వీర్యకణం, అండాశయంతో పనిలేకుండా మూలకణాలతోనే ప్రయోగశాలలో ఎలుక పిండాన్ని సృష్టించటం విశేషం. దీనికి ఆరోనాడు తోక, ఎనిమిదో రోజున కొట్టుకునే గుండె పుట్టుకొచ్చాయి.
చివరికి మెదడు ఏర్పడటమూ మొదలైంది. దీనిలోని కణాలు, భాగాల పనితీరు 95% వరకు అసలు పిండం మాదిరిగానే ఉండటం గమనార్హం. అందుకే కొందరు శాస్త్రవేత్తలు దీన్ని 2022లో అతి ముఖ్యమైన శాస్త్ర పురోగతిగా అభివర్ణిస్తున్నారు. కృత్రిమ అవయవాలను వృద్ధి చేయటానికి.. పిండంలో ఏర్పడే జన్యు మార్పులు, ఎదుగులతో ముడిపడిన సమస్యల మధ్య సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్యాన్సర్‌పై అద్భుత విజయం
క్యాన్సర్ తిరగబెట్టకుండా ఉండటం కాదు.. పూర్తిగా కనుమరుగైతే? ఇలాంటి ఇమ్యునో చికిత్సనే రూపొందించారు శాస్త్రవేత్తలు. దీన్ని పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 మందిపై పరీక్షించగా.. అందరిలోనూ క్యాన్సర్ తుడిచిపెట్టుకుపోవటం విశేషం. క్యాన్సర్ చికిత్స చరిత్రలో ఇలాంటి ఘనతను సాధించటం ఇదే తొలిసారి. రొమ్ముక్యాన్సర్ చికిత్సలోనూ ఇలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. హర్2 ప్రొటీన్‌లో జన్యుమార్పులతో కూడిన కణితిలోని కణాల పనిపట్టే మోనోక్లోనల్ యాంటీబాడీని శాస్త్రవేత్తలు రూపొందించారు.