కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఆయితే కాస్త ఆగండి. 5జీ సాంకేతికతతో అందుబాటు ధరలోనే స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో. కొద్ది వారల క్రితమే జియోబుక్ పేరిట చౌకగా ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది జియో. ఇప్పుడు ఈ రెండు ఉత్పత్తులను సంస్థ 2021 వార్షిక సదస్సులో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
జియో 5జీ స్మార్ట్‌ఫోన్..
ప్రస్తుతం తయారీ దశలో ఉన్న జియో 5జీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. టెక్ దిగ్గజం గూగుల్ భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేస్తున్నారు.
5జీ ఫోన్ ఫీచర్లపై ఓ నిర్ణయానికి వచ్చిన జియో.. ఓఎస్‌పై చర్చలు జరుపుతోందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న జియో సేవలతో ఆ ఓఎస్ లోతైన అనుసంధానం కలిగి ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ కస్టమ్ వెర్షన్ అయిన జియో ఓఎస్‌ను కూడా రిలయన్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.
జియో ఓఎస్ గురించి ఇప్పటికైతే ఎక్కువ సమాచారం లేకున్నా.. జియో అప్లికేషన్ల పనితీరును అది మరింత మెరుగుపర్చనుంది. ఇక ఎంట్రీ లెవెల్ ఫోన్లలో జియో.. ఆండ్రాయిడ్ స్టాండర్డ్ వెర్షన్, ఆండ్రాయిడ్ గో ఓఎస్‌లలో ఏది వాడుతుందో చూడాలి.
జియో ల్యాప్‌టాప్..
5జీ ఫోన్‌తో పాటే బడ్జెట్ ధరలో అందుబాటులోకి రానుంది జియోబుక్ ల్యాప్‌టాప్. దీనికోసం చైనా సంస్థ బ్లూబ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో కలిసి పనిచేస్తోంది జియో.