అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవలే చంద్రుడిపైకి అర్టెమిస్ ప్రయోగాన్ని తలపెట్టింది. తాజాగా జపాన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ ఐస్పేస్ మరో ప్రయోగాన్ని చేపట్టింది. ఐస్పేస్ ల్యాండర్‌ను సమకూర్చగా.. స్పేస్ఎక్స్ రాకెట్, యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ లూనార్ రోవర్‌తో దీనిని ప్రయోగించారు. ఈ ప్రయోగం పూర్తయ్యేందుకు సుమారు 5 నెలల సమయం పట్టనుంది. అమెరికా నాసా చేపట్టిన ప్రయోగం కేవలం ఐదు రోజుల్లోనే పూర్తయి.. ఒరియాన్ చంద్రుడిపైకి చేరింది. అయితే తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తూ.. డబ్బును ఆదా చేసేలా ఈ ల్యాండర్‌ను తయారు చేశామని, అందుకే 5 నెలల సమయం పడుతుందని వెల్లడించారు ప్రతినిధులు. సుమారు 16 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి చంద్రుడిపైకి చేరుకుంటుందని చెప్పారు.
చంద్రుడికి ఈశాన్యంలో ఉన్న అట్లాస్ కార్టర్ లక్ష్యంగా ఈ రాకెట్ దూసుకెళ్తుందని తెలిపారు. ఇప్పటికే మార్స్‌పై ప్రయోగాలు చేపట్టిన యూఏఈ.. ఇప్పుడు చంద్రుడి ప్రయోగాలకు ఆసక్తి చూపిస్తోంది. ల్యాండర్లో రోవర్‌తో పాటు జపాన్ స్పేస్ ఏజెన్సీ ఓ బంతిలాంటి వస్తువును పంపించింది. ఇది చంద్రుడిపైకి దిగాక ఓ రోబోలాగా మారిపోనుంది. చంద్రుడిపై ఉన్న దుమ్మును సైతం తట్టుకుని తిరిగేలా దీన్ని రూపొందించారు. 2024లో రెండో ప్రయోగాన్ని, 2025లో మూడో ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఐస్పేస్ సంస్థ ప్రకటించింది. ఐస్పేస్ మిషన్‌ను హకుటో అని కూడా పిలుస్తారు. జపనీస్‌లో హకుటో అంటే తెల్ల కుందేలు అని అర్థం. ఇది చంద్రుడిపైన ఉంటుందని వారి నమ్మకం.