ఓ సారి టైమ్ మెషీన్ ఎక్కేసి.. కాలంలో వెనక్కు ప్రయాణిద్దాం పదండి. అలా.. ఎక్కడిదాకా పోదామంటే.. మానవ పరిణామక్రమం ఆరంభం దాకా పోదాం. ఇక్కడ ఆగుదాం. మనిషి కోతి నుండి విడివడి.. రూపాంతరం చెందుతూ.. చెందుతూ.. కొన్ని లక్షల ఏళ్ల మార్పు తర్వాత.. నేటి ఆధునిక మనిషిగా మార్పు చెందాడు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ గ్యాప్ లో చాలా మార్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైన ఛేంజ్ ఏమంటే.. మనిషికి ఉన్న తోక మాయమైపోవడం! అవును.. తొలినాళ్లలో మనుషులకు తోకలు కూడా ఉండేవని.. పరిణామ క్రమంలో కొద్ది కొద్దిగా తోక మాయమైపోయిందనే థియరీ చెప్పినారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమంటే.. ఆ తోకను మళ్లీ మొలిపించారు!
"ఏంటేంటేంటేంటీ...? మనిషికి తోకా? ఈ సైంటిస్టులకు పనీపాటా ఏమీ లేదా? ఈకలు.. తోకలు.. కోళ్లకు, కుక్కలకు బాగుంటాయి గానీ.. గీ మనుషులకేందిరా బై" అంటున్నారా? ఇదే ప్రశ్న వేస్తే.. "జస్ట్ చిల్ బ్రో" అంటున్నారా పరిశోధకులు. తాము అలాంటి పని ఎందుకు చేయాల్సి వస్తోందో ఇలా.. చెప్తున్నారు. వినుకోండి మరి...
దాదాపుగా ప్రతి జంతువుకూ.. ప్రతి పక్షికీ.. తోక ఉంటుంది. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి.. అవి పలు రకాలుగా ఉంటాయి. మనలో చాలా మందికి.. ఆ తోక గురించి తెలుసు తప్ప, అది ఎంతగా ఉపయోగ పడుతుందో తెలియదు. ఒక పక్షి ఆకాశంలో అలుపు లేకుండా ఎంతదూరమైనా ప్రయాణించడానికి కేవలం రెక్కలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా తోక కూడా ఉండాల్సిందే. లేదంటే.. పక్షి ప్రయాణ వేగం గణనీయంగా పడిపోతుంది. కొన్ని సరిగా ఎగరలేక పడిపోతాయి కూడా..
ఇక, జంతువుల్లో.. కంగారూను తీసుకుంటే.. దాని తోకను ఏకంగా ఐదో కాలుతో పోలుస్తారు సైంటిస్టులు. ఈ పోలిక చాలు.. దాని తోకకున్న కెపాసిటీ ఏంటో చెప్పడానికి! కేవలం తోక మీద నిలబడి నాలుగు కాళ్లతో అది ఫైట్ చేయగలదు. నీటిలోని చేప సంగతి చూస్తే.. వాయువేగంతో ప్రయాణించే మీనాలకు తోకే ప్రధాన ఆధారం. ఉన్నట్టుండి ఏ టర్న్ తీసుకోవాలన్నా కూడా తోకే కీలకం.