ISRO Chandrayaan 3 Update :చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్ మాడ్యుల్ చంద్రుని ఉపరితలానికి మరింత చేరువైంది. చంద్రుని ఉపరితలానికి చేరువయ్యేందుకు చేపట్టిన చివరిదైన రెండో డీబూస్టింగ్ ఆపరేషన్ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది.
చంద్రుడిపై కాలుమోపడమే లేటు!
Chandrayaan 3 Vikram Second Deboosting :చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కీలక ఘట్టం పూర్తికావడం వల్ల ల్యాండర్ విక్రమ్.. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక, చివరిదశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై దృష్టి పెట్టారు. అన్నీ అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు 23న చంద్రుడి దక్షిణధ్రువంపై ఘనంగా కాలుమోపనుంది.
'సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం'
Chandrayaan 3 Vikram Lander :"రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌తో ల్యాండర్ మాడ్యూల్ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్‌లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది" అని ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది.
Chandrayaan 3 Propulsion Module Separation :కాగా..చంద్రయాన్-3 వ్యోమనౌక నుంచి ల్యాండర్ విక్రమ్.. గురువారం విడిపోయింది. చంద్రుడి ఉపరతలంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ల్యాండర్ మాడ్యూల్ 'థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్' అని ఓ మెసేజ్ పంపినట్లు ఇస్రో తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి కావడం వల్ల శుక్రవారం ఆగస్టు 18 సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్-1 ప్రక్రియ చేపట్టిన ఇస్రో.. ఆదివారం ల్యాండర్ మాడ్యూల్ డీ-ఆర్బిట్-2 ప్రక్రియ చేపట్టింది.
Chandrayaan 3 Launch Date And Time :చంద్రయాన్-3ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. మరుసటిరోజు తొలిసారిగా కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో విడతలవారీగా ఐదుసార్లు కక్ష్యను పెంచారు. 5వ భూకక్ష్య పూర్తైన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న 'ట్రాన్స్ లూనార్ కక్ష్య'లోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా 6, 9, 14, 16 తేదీల్లో కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేశారు.