ISRO Chandrayaan 3 Moon Images : జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అవాయిడెన్స్ కెమెరా (LHDAC) తీసిన జాబిల్లి చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఆగస్టు 19వ తేదీన తీసిన ఈ చంద్రుని చిత్రాలను ఇస్రో.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. బండరాళ్లు లేదా లోతైన గుంతలు లేకుండా సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ కెమెరా సహాయపడుతుందని ఇస్రో పేర్కొంది.
ల్యాండింగ్ టైమ్ ఛేంజ్..
Chandrayaan 3 Landing Time : ఈనెల 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై 'విక్రమ్' సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయాన్ని ముందు 23వ తేదీ సాయంత్రం 5.45నిమిషాలకు నిర్ణయించిన ఇస్రో... తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6.04 నిమిషాలకు మార్చింది. సాఫ్ట్ ల్యాండింగ్‌కు ముందు ల్యాండర్ మాడ్యూల్‌లో అంతర్గత తనిఖీలు చేయనున్నట్లు ఇస్రో తెలిపింది. ల్యాండింగ్ ప్రాంతంలో సూర్యోదయం వరకు వేచి చూడనున్నట్లు వెల్లడించింది.
'అంతరిక్ష అన్వేషణలో చారిత్రక మైలురాయి'
Chandrayaan 3 Landing Site : చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 మిషన్.. అంతరిక్ష అన్వేషణలో చారిత్రక మైలురాయిని చేరనుందని ఇస్రో తెలిపింది. సుమారు 30కిలోమీటర్ల ఎత్తులో శక్తితో కూడిన బ్రేకింగ్ దశలోకి ప్రవేశించినున్న ల్యాండర్.. చంద్రుని ఉపరితలంపై దిగటానికి థ్రస్టర్లను ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుందని పేర్కొంది. దాదాపు 100మీటర్ల ఎత్తులో సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేదో తనిఖీ చేసేందుకు.. ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని స్కాన్ చేస్తుందని వెల్లడించింది.
ల్యాండింగ్ లైవ్‌కు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు..
Chandrayaan 3 Landing Live Telecast : ఈ ప్రక్రియను వివిధ వేదికలపై ప్రత్యక్షప్రసారం ద్వారా చూసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. ఈనెల 23న సాయంత్రం 5.27నిమిషాలకు....ఇస్రో వెబ్‌సైట్, ఇస్రో యూట్యూబ్ చానల్, ఇస్రో ఫేస్‌బుక్ ఫేజ్, డీడీ నేషనల్ ఛానల్‌లో ప్రత్యక్షప్రసారం చూడొచ్చని తెలిపింది. చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించే విధంగా ప్రత్యక్షప్రసారానికి ఏర్పాట్లు చేయాలని దేశంలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను ఇస్రో కోరింది.