ISRO Aditya L1 Mission :చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో).. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసంఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన లాంఛ్ రిహార్సల్, రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని బుధవారం ఇస్రో ట్వీట్ చేసింది.
Aditya L1 Mission Launch Date And Time : శనివారం ఉదయం 11.50 నిమిషాలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది ఇస్రో. కొరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఆదిత్య ఎల్-1 ప్రాజెక్టు ఉద్దేశం. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ వ్యోమనౌకను ప్రవేశపెట్టనున్నారు. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది. ఆదిత్య ఎల్-1ను వివిధ జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేసినట్లు ఇస్రోకు చెందిన ఓ అధికారి ఇటీవలే తెలిపారు.
కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు..
Sun Mission Isro : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇదే. 1500 కిలోల బరువున్న శాటిలైట్ ఇది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఆదిత్య-ఎల్ 1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్తో పాటు సోలార్ అవైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్-లో-ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్లను అమర్చనున్నారు. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు.